ఫోటోషాప్ చేసి ఫేక్ న్యూస్!.. పాక్ మీడియాపై టీమిండియా మాజీ క్రికెటర్ ఫైర్!!
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, తప్పుడు వార్తలను ఎదుర్కోవడంపై స్పందిస్తూ ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి వెల్లడించారు. ఓ సారి పాకిస్థానీ క్రికెటర్ బాబర్ ఆజం తనను ఇంటర్వ్యూ చేయడానికి నిరాకరించాడంటూ పాకిస్థాన్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ వైరల్ అయిందని ఇర్ఫాన్ పఠాన్ తెలిపారు. జియో హాట్ స్టార్ 'చీకీ సింగిల్స్' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ ఈ వివరాలను పంచుకున్నారు.
పాక్ మీడియా ప్రచారం చేసిన కథనం పూర్తిగా అబద్ధమని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశారు. " పాకిస్థాన్‌ను ట్రోల్ చేస్తాననే కారణంతో బాబర్ ఆజం నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని అక్కడ ఓ కథనాన్ని సృష్టించారు. దాని కోసం వేరొకరి ఫోటోపై నా ముఖాన్ని ఫోటోషాప్ చేశారు" అని ఇర్ఫాన్ పఠాన్ వివరించారు. అసలు ఆ ఫోటోలోని వ్యక్తం ఓ యువ బంగ్లాదేశీ జర్నలిస్ట్ అని.. అతనికి బాబర్ ఇంటర్వ్యూ నిరాకరించగా.. ఆ జర్నలిస్ట్ శరీరంపై నా ముఖాన్ని ఫోటో షాప్ చేసి మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించారని ఇర్ఫాన్ పఠాన్ ఎండగట్టారు.

"దానికి పది లక్షలకు పైగా వీక్షణలు రావడంతో, అది నేనేనని ప్రజలు నమ్మారు. ఇది ప్రతిరోజూ జరుగుతుంది, కానీ నేను స్పందించను. ప్రతిరోజూ, మా పేరు మీద గానీ లేదా ఏదో ఒక ఆటగాడి గురించి గానీ ఏదో ఒక అబద్ధం చెబుతూనే ఉంటారు. మీరు ప్రతి ఒక్కరికీ స్పందిస్తూ ఉంటే, మీ జీవితాన్ని మీరు జీవించలేరు," అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.
ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ కెరీర్
2003 నుంచి 2012 వరకు భారత జట్టులో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా సేవలందించిన ఇర్ఫాన్ పఠాన్.. 141 ఇన్నింగ్స్‌లలో 2,821 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉండగా.. బెస్ట్ స్కోరు 102 పరుగులుగా ఉంది. 29.85 సగటుతో 301 వికెట్లు పడగొట్టి, 9 సార్లు ఐదు వికెట్లు, 2 సార్లు 10 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించి 103 మ్యాచ్‌లలో 80 వికెట్లు పడగొట్టి, 82 ఇన్నింగ్స్‌లలో ఒక అర్ధశతకంతో 21.49 సగటుతో 1,139 పరుగులు చేశాడు.




Click it and Unblock the Notifications