AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం- ఈ జిల్లాలకు వర్షాల హెచ్చరిక..!
నైరుతి రుతుపవనాలు సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు శుభవార్త. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కాస్తా 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షాలు తప్పవని విపత్తుల నిర్వహణ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని (Rain Alert) ఆయన తెలిపారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్ , హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని కోరారు. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాబట్టి తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అలాగే రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల విభాగం ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో కూడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.




Click it and Unblock the Notifications