టెంబా బావుమా, డేవిడ్ మిల్లర్ మేజిక్: ఆస్ట్రేలియాపై సెంచరీలు బాదిన హీరోలు: భారీ స్కోర్
జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా తడాఖా చూపింది. కెప్టెన్ టెంబా బవుమా అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. అతనికి డేవిడ్ మిల్లర్ తోడయ్యాడు. మిల్లర్ కూడా సెంచరీతో చెలరేగాడు. దీంతో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ సాధించింది. వారిద్దరి ధాటికి ఆస్ట్రేలియా బౌలర్లు చేతులెత్తేశారు. ఒకదశలో ఆస్ట్రేలియా మ్యాచ్ పై పట్టు సాధించినట్టు కనిపించినప్పటికీ.. బావుమా, మిల్లర్ లను కదిలించకపోయారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో పడినప్పటికీ, బావుమా పట్టుదల వదల్లేదు. బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన అద్భుత ప్రదర్శనతో జట్టును కుప్పకూలకుండా సంక్షోభం నుంచి గట్టెక్కించాడు.

ఈ ఇన్నింగ్స్ ప్రారంభంలో దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. జోష్ హేజిల్‌వుడ్ వేసిన మొదటి బంతికే ఎయిడెన్ మార్క్ రమ్ డకౌట్‌గా వెనుతిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ బావుమా, ఓపెనర్ క్వింటన్ డి కాక్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. ఆ కొద్దిసేపటికే 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ కు డికాక్ కూడా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కేతో కలిసి బవుమా 57 పరుగులు జోడించాడు.
మొదటి వన్డేలో సెంచరీ చేసిన బ్రీట్జ్కే నిరాశపరిచాడు. 34 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా 93 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. పరుగుల కోసం కష్టపడుతున్న తరుణంలో క్రీజ్ లోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ తో కలిసి బావుమా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లకు ఎలాంటి వికెట్ అవకాశం ఇవ్వకుండా దాదాపు 22 ఓవర్ల పాటు క్రీజులో నిలదొక్కుకున్నారు.
మైదానంలో పరుగుల వరద పారించారు. 150 పరుగులకు పైగా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు మ్యాచ్‌లో ఊహించని విధంగా తిరిగి పుంజుకుని బలమైన స్థితిలోకి చేరుకుంది. ఈ క్రమంలో బావుమా 112 బంతుల్లో వన్డేల్లో తన ఆరో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తం 116 బంతులు ఎదుర్కొన్న ఈ సఫారీ కెప్టెన్ 10 ఫోర్లు, రెండు భారీ సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేసి, జాక్ ఎడ్వర్డ్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
అతను అవుట్ అయినప్పటికీ.. డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు. 93 బంతుల్లో 142 పరుగులు సాధించాడు. ఎడ్వర్డ్స్ బౌలింగ్ లోనే కామెరాన్ గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 49 ఓవర్లల్లో 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. డువాన్ జెన్ సెన్- 20, కేశవ్ మహరాజ్ క్రీజ్ లో ఉన్నారు.
ఆస్ట్రేలియాపై కెప్టెన్‌గా బావుమాకు ఇది రెండో వన్డే శతకం. వన్డేల్లో అతను సాధించిన ఆరు సెంచరీలలో అయిదు కెప్టెన్‌గానే సాధించడం గమనార్హం. ఈ ఘనతతో దక్షిణాఫ్రికా తరఫున కెప్టెన్‌గా అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మాజీ ప్లేయర్ ఫాఫ్ డు ప్లెసిస్ అయిదు సెంచరీల రికార్డును సమం చేశాడు. ఏబీ డివిలియర్స్ 13 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా, గ్రేమ్ స్మిత్ 8 సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications
