భారత్ పై మొదటి వన్డేలో సెంచరీ బాదిన వెస్టిండీస్ స్టార్ బ్యాటర్
తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో భారత్ తో జరుగుతున్న మొదటి వన్డేలో వెస్టిండీస్ సత్తా చాటుతోంది. భారీ స్కోర్ దిశగా పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో వెస్టిండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ సెంచరీ ఊదిపడేశాడు. భారత బౌలింగ్ ను తుత్తునీయలు చేస్తూ మొదటి వన్డేలోనే వంద పరుగులను అందుకున్నాడు. 35 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్.. మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం గ్రీవ్స్- 101, అమిర్ జంగూ- ఒక పరుగుతో క్రీజ్ లో ఉన్నారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగింది వెస్టిండీస్. ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం మొదలు పెట్టింది. ఓపెనర్లు జాన్ క్యాంప్ బెల్, జస్టిన్ గ్రీవ్స్ క్రీజ్ లో పాతుకుపోయారు. పిచ్ నుంచి అందిన సహకారంతో ధాటిగా షాట్లు ఆడారు. ఈ క్రమంలో ఓపెనర్లిద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. బలమైన టీమిండియా బౌలింగ్ ను ఎదుర్కొంటూ ఇద్దరూ కలిసి మొదటి వికెట్ నష్టానికి ఏకంగా 135 పరుగులు జోడించారంటే ఎంత కుదురుగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.

జట్టు స్కోరు 135 పరుగుల వద్ద ఉన్నప్పుడు జాన్ క్యాంప్ బెల్ అవుట్ అయ్యాడు. కుల్ దీప్ యాదవ్ బౌలింగ్ లో ప్రసిద్ధ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 60 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఆరు బుల్లెట్ల వంటి ఫోర్లతో 62 పరుగులు చేశాడు క్యాంప్ బెల్. వన్ డౌన్ గా బరిలోకి దిగిన కీసీ కార్టీ ఎక్కువ సేపు క్రీజ్ లో నిల్చోలేకపోయాడు 31 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసిన అతను ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ లో గిల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన కేప్టెన్ షై హోప్ కూడా నిరాశపరిచాడు. 12 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లల్లో కుల్ దీప్ యాదవ్- 2, ప్రసిద్ధ్ ఒక వికెట్ పడగొట్టారు. ఇంకా 15 ఓవర్లు మిగిలివుండటంతో వెస్టిండీస్ 250కి పైగా స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్ పదును తగ్గడాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు వెస్టిండీస్ బ్యాటర్లు.












Click it and Unblock the Notifications
