టీటీడీతో జతకలిసిన రిలయన్స్ వంతార
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలలను రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి అత్యంత వేగంగా అడుగులు పడుతున్నాయి. జంతు సంక్షేమం, పరిశుభ్రత, భద్రత, మూగజీవాల సౌకర్యాలపరంగా వీటిని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోన్నారు. ఈ క్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన ప్రముఖ వన్యప్రాణి సంరక్షణ సంస్థ వంతారా రంగంలోకి దిగబోతోంది. గోశాలల ఆధునీకరణ పనులను ఎలాంటి లాభాపేక్ష లేకుండా, పూర్తిగా ఉచితంగా చేపట్టడానికి ముందుకొచ్చింది.
తిరుమల పద్మావతి అతిథి గృహంలో ఈ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, వంతారా ప్రతినిధులతో స్వయంగా సమావేశం అయ్యారు. గోశాలలు, జంతు సంరక్షణ కేంద్రాల సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల నాణ్యత మెరుగుదలపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న వసతులను మరింత వైవిధ్యంగా ఆధునీకరించి, పశువులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని ఆయన కోరారు.

శ్రీవారి నిత్య కైంకర్యాలు, నివేదనలకు అవసరమైన స్వచ్ఛమైన పాలు, ఇతర అనుబంధ పాల ఉత్పత్తులను వీలైనంత వరకు తిరుమల కొండపైనే ఉత్పత్తి చేసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని వెంకయ్య చౌదరి సూచించారు. బయటి మార్కెట్ నుంచి ఉత్పత్తులను తీసుకురావడానికి బదులుగా, తిరుమల అంతర్గత గోశాలల నుంచే సేకరించడం వల్ల స్వామివారి సేవలకు మరింత పవిత్రత చేకూరుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వంతారా ప్రతినిధులు వెంకయ్య చౌదరికి ఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గోశాలల సమగ్ర ఆధునీకరణలో భాగంగా వంతారా సంస్థ అత్యాధునిక రక్షణ, పర్యావరణ ప్రమాణాలకు పెద్దపీట వేస్తోన్నామని వివరించారు. గోశాలల అభివృద్ధిలో భాగంగా గోడలకు టైల్స్ ఏర్పాటు, స్టీల్ నిర్మాణాలకు పెయింటింగ్, పక్షులు, ఇతర జంతువులు ప్రవేశించకుండా జీఐ మెష్ ఏర్పాటు, స్టెయిన్లెస్ స్టీల్ గేట్ల ఏర్పాటు, గోడల మరమ్మతులు, పెయింటింగ్ తదితర పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
మూగజీవాల కదలికలకు అనుగుణంగా గోశాల స్తంభాల మధ్య దూరం, తగినంత గాలి ప్రసరించేలా వీటిని నిర్మించడం, మేత, నీటి వసతులు, సరైన డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు. గోశాల పరిసరాల్లో పచ్చటి మొక్కలు నాటడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తామని వంతారా ప్రతినిధులు తెలిపారు. శాల పరిసర ప్రాంతాలలో అత్యంత పచ్చటి మొక్కలు నాటడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తామని చెప్పారు.
గో సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, తిరుమలలో జంతు సంక్షేమ ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే పరమావధిగా టీటీడీ ముందుకు సాగుతోంది. ఈ మార్పులతో తిరుమల గోశాలలు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న గో సంరక్షణాలయాలకు ఓ రోల్ మోడల్‌గా నిలుస్తాయని టీటీడీ భావిస్తోంది.













Click it and Unblock the Notifications
