అమరావతిపై అడకత్తెరలో జగన్ ? హైకోర్టు తీర్పు అమలు చేయలేక- సుప్రీంలో అప్పీలు చేయలేక !
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక అప్పటికే రాజధానిగా ఎంపికై ఓ మోస్తరుగా పనులు కూడా పూర్తి చేసుకున్న అమరావతిని కాదని మూడు రాజధానుల వైపు మొగ్గింది. అయితే దీనిపై అప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో సర్కార్ ప్లాన్ బెడిసికొట్టింది. అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ సర్కార్ కు గండంగా మారింది. అలాగని దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు. దీంతో ప్రభుత్వం పరిస్దితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోతోంది.

అమరావతి తీర్పు తర్వాత
అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు జగన్ సర్కార్ కు గండంగా మారిపోయింది. అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న వైసీపీ సర్కార్ కు హైకోర్ట్ ఏకంగా ఆరునెలల డెడ్ లైన్ పెట్టి మరీ రాజధాని అభివృద్ధి చేయమంటోంది. దీంతో హైకోర్టు తీర్పును అమలు చేసే విషయంలో ప్రభుత్వం తీవ్ర మల్లగుల్లాలు పడుతోంది. నిధుల కొరతను సాకుగా చూపుతూ 6 నెలల గడువును 60 నెలలకు పెంచాలంటూ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే దీనిపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ లోపే రైతులు అమరావతిలో పనులు కావడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వాన్ని పనుల స్టేటస్ రిపోర్ట్ కోరింది.

అసెంబ్లీలోనే తేల్చేసిన సర్కార్
అమరావతి రాజధాని అభివృద్ధిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు సాధ్యం కాదంటూ వైసీపీ సర్కార్ ని మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీఎం జగన్ కూడా స్వయంగా అసెంబ్లీలోనే ఎప్పుడో కుండబద్దలు కొట్టేశారు. పైకి మాత్రం హైకోర్టు తీర్పు అమలుకు నిధుల్లేవంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే హక్కు హైకోర్టుకు లేదని ఓవైపు అసెంబ్లీలో చెప్పేసిన ప్రభుత్వం.. పైకి మాత్రం నిధుల లేమి జపం చేస్తోంది. దీంతో హైకోర్టు తీర్పు అమలు జరగడం లేదని భావిస్తున్న రైతులు తిరిగి కేసు వేశారు.

సుప్రీంలో అప్పీలుకు వెనకడుగు ?
అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం ఇష్టం లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ మేరకు ఊరట కోరే అవకాశం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. హైకోర్టు తీర్పేమీ ఫైనల్ కాదు. కానీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ప్రభుత్వం అస్సలు ముందుకు రావడం లేదు. హైకోర్టు తీర్పు తర్వాత న్యాయనిపుణులతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసే విషయమై నెలలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోలేదు. అంటే ఇక సుప్రీంను ఆశ్రయించడం లేదని అర్ధమైపోయింది.

ఎటూ తేల్చుకోలేకపోతున్న జగన్ ?
అమరావతిపై హైకోర్టు తీర్పు అమలు విషయంలో వైసీపీ సర్కార్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. రైతులకు ఫ్లాట్లు ఇచ్చే విషయంలో కాస్త ముందడుగు వేసిన ప్రభుత్వం.. ఆలస్యానికి పరిహారం కోరుతూ రైతులు వేసిన పిటిషన్ తో తిరిగి ఆత్మరక్షణలో పడింది. నిధుల కొరత కారణంగా మిగతా భవనాల నిర్మాణం విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. అలాగని వాటిని పూర్తిగా వదిలేసే పరిస్ధితి లేదు. దీంతో మొక్కుబడిగా పనులు ప్రారంభించి కాలయాపన చేస్తోంది. దీంతో పరిస్ధితిని గమనించిన అక్కడి రైతులు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు నిన్న స్టేటస్ రిపోర్ట్ కోరింది. దీంతో ఇప్పుడు రెండు నెలల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. మరి ప్రభుత్వం పనులపై దూకుడు పెంచుతుందా లేక ఇప్పటికైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications