కీ రోల్: థర్డ్ ఫ్రంట్ వైపే కెసిఆర్ మొగ్గు, కుదరకుంటేనే..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు థర్డ్ ఫ్రంట్ పైన బాగానే ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే మొదట మద్దతిచ్చేది తామేనని చెబుతున్నప్పటికీ.. వారు ఎక్కువగా థర్డ్ ఫ్రంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. యూపిఏ, ఎన్డీయే వైపు వెళ్లలేని వివిధ పార్టీల నాయకులతో తెరాస నాయకులు మంతనాలు సాగిస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఏ ఒక్క కూటమికో అనుకూలంగా ఉండవని, ఏ కూటమికీ మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడుతుందని తెరాస అంచనా వేస్తోంది. ఎన్నికల ముందు ఉన్న కూటముల కన్నా ఎన్నికల తరువాత ఏర్పడే కూటమిదే కీలక పాత్ర అవుతుందని తెరాస అంచనా వేస్తోంది. కొత్తగా ఏర్పడే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు ఉండాలంటే అనుకూలమైన ప్రభుత్వం ఉండాలని తెరాస కోరుకుంటోంది.
ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల పరిస్థితులను అంచనా వేస్తున్నారు. తెరాస అధ్యక్షులు కెసిఆర్ పోలింగ్ ముగిసిన తరువాత వరుసగా పార్టీ ముఖ్య నాయకులు కొందరితో సమాలోచనలు జరిపారు. ఇష్టాగోష్టిగా జరిగిన ఈ సమావేశాల్లో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండవచ్చు అనే అంశంపై పార్టీ నాయకుల మధ్య చర్చ సాగిందని సమాచారం. ఎన్డీయే కూటమి హడావుడి ప్రచారంలో కనిపిస్తున్నా ఫలితాల్లో ఆ స్థాయిలో ఉండదని తెరాస అంచనా వేస్తోంది.

2004, 2009ల్లో అదే జరిగిందని చెబుతున్నారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో రెండుసార్లు యుపిఏ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన సీట్లే కీలక పాత్ర వహించాయి. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి లేదు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఒక్క ఎంపి సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న 17 సీట్లలో కాంగ్రెసు పార్టీ గెలుచుకునేది తక్కువే అని భావిస్తున్నారు.
యుపిఏ కోల్పోయే సీట్లలో ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఈ సీట్లలో బిజెపి ప్రభావం కూడా అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల తరువాత కొత్త కూటమి ఏర్పడవచ్చునని తెరాస భావిస్తోంది.
తెలంగాణకు ఏ కూటమితో జతకడితే ప్రయోజనం అనుకుంటే ఆ కూటమితో చేతులు కలుపుతామని తెరాస నాయకులు చెబుతున్నారు. ఏ కూటమికి మెజారిటీ రాకుండా మూడవ ఫ్రంట్ ఏర్పడితే కీలక పాత్ర వహించవచ్చునని తెరాస అంచనా వేస్తోంది. అందుకే తెరాస ఎక్కువగా మూడో కూటమి వైపే మొగ్గు చూపుతోంది. అయితే థర్డ్ కాకుండా యూపిఏ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే తెరాస ఆ వైపే మొగ్గు చూపుతుంది.












Click it and Unblock the Notifications