ఉద్రిక్తత మధ్య: 6 జెడ్పీలు తెరాసవే, నల్గొండలో కాంగ్రెస్
హైదరాబాద్: జడ్పీ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో తెరాస హవా కొనసాగింది. రెండు రోజుల క్రితం మెజారిటీ మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లను దక్కించుకున్న అధికార తెరాస.. జిల్లా పరిషత్ పీఠాల విషయంలోనూ అదే దూకుడు ప్రదర్శించింది. పూర్తి బలం ఉన్న జిల్లాలతో పాటు, హంగ్ జడ్పీలనూ కైవసం చేసుకుంది. ఖమ్మం జడ్పీ చైర్మన్ ఎన్నిక తేదీ ప్రకటించలేదు. కోరం లేక రంగారెడ్డి జడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
నల్గొండలో కాంగ్రెస్ ఏకగ్రీవంగా పీఠాన్ని దక్కించుకుంది. మిగతా ఆరు జిల్లాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తెరాసకు పూర్తి మెజారిటీ ఉంది. కాంగ్రెస్ సభ్యులను చేర్చుకోవడం ద్వారా మెదక్ జడ్పీ పీఠం తెరాస వశమైంది. వరంగల్, మహబూబ్‌నగర్ పీఠాలు ఉద్రిక్తత, నాటకీయ పరిణామాల మధ్య తెరాసకు దక్కాయి. తెరాసకు వరంగల్‌లో మద్దతు తెలిపిన టీడీపీ సభ్యుడికి, పాలమూరులో అండగా నిల్చిన కాంగ్రెస్ సభ్యుడికి వైస్ చైర్మన్ పదవులు దక్కాయి.

కరీంనగర్ జిల్లాలో తెరాసకు సంపూర్ణ మెజార్టీ ఉంది. దీంతో అక్కడ ఆ పార్టీకి చెందిన తుల ఉమ దక్కించుకున్నారు. ఆదిలాబాద్ జడ్పీ ఎన్నికల్లో దాదాపు నాలుగింట మూడొంతుల స్థానాలు దక్కించుకున్న తెరాస.. చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ సభ్య స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. నిర్మల్ జడ్పీటీసీ సభ్యురాలు వి శోభారాణి చైర్ పర్సన్‌గా, చెన్నూరు జడ్పీటీసీ సభ్యుడు మూల రాజారెడ్డి వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు.
నిజామాబాద్‌కు దాపేదారు రాజు నిజామాబాద్ జిల్లాలో మూడింట రెండొంతుల మంది జడ్పీటీసీ సభ్యులను గెలిపించుకున్న తెరాస... జడ్పీ అన్ని పదవులనూ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. మెజారిటీ లేదని కాంగ్రెస్ సభ్యులెవరూ నామినేషన్ వేయలేదు. జడ్పీ చైర్మన్‌గా నిజాంసాగర్ జడ్పీటీసీ సభ్యుడు దాపేదారు రాజు, వైస్ చైర్ పర్సన్‌గా ధర్పల్లి జడ్పీటీసీ సభ్యురాలు జి సుమన ఎన్నికయ్యారు.
సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా అయిన మెదక్ జడ్పీని కూడా గులాబీ దళం కైవసం చేసుకున్నది. నర్సాపూర్ జడ్పీటీసీ సభ్యురాలు సి రాజమణి మురళీ యాదవ్ చైర్‌పర్సన్‌గా, నంగునూర్ జడ్‌పీటీసీ సభ్యుడు ఆర్ .సారయ్య వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదట మేజిక్ ఫిగర్‌కు సరిపడా సభ్యులు లేని తెరాస గూటికి... ఎన్నికకు ముందే ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు చేరిపోయారు. దీంతో అవసరమైన మెజారిటీ వచ్చింది.
చైర్మన్ ఎన్నిక సందర్భంగా, టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి మరొకరు మద్దతు పలికారు. ఈ రెండు పదవుల కోసం పోటీ పడిన కాంగ్రెస్ విజయం కోసం ప్రయత్నించలేదు. సభ్యులకు విప్ జారీ చేయలేదు. ఉద్రిక్తత, నాటకీయ పరిణామాలు, ఘెరావ్‌లు, బైఠాయింపుల మధ్య పాలమూరు జడ్పీ తెరాస వశమైంది. ఆ పార్టీకి చెందిన గద్వాల జడ్పీటీసీ సభ్యుడు భండారి భాస్కర్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తెరాస గూటికి చేరిన కాంగ్రెస్ జడ్పీటీసీ నవీన్ కుమార్‌కు వైస్ పీఠం దక్కింది.
వరంగల్ జడ్పీలో ఎక్కువ మంది సభ్యులున్న కాంగ్రెస్.. ఏ పదవినీ దక్కించుకోలేకపోయింది. చివరకు నామినేషన్ పత్రాలపై చేసిన సంతకాల్లో పోలిక లేకపోవడంతో కో ఆప్షన్ పదవులనూ కోల్పోయింది. చైర్‌పర్సన్‌గా తెరాస నర్మెట జడ్పీటీసీ సభ్యురాలు గద్దల పద్మ ఎన్నికయ్యారు. తెరాసకు మద్దతిచ్చిన టీడీపీ జడ్పీటీసీ సభ్యుడు చెట్టుపల్లి మురళీధర్‌ను వైస్ చైర్మన్ పదవి వరించింది.
కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండలో జడ్పీని ఆ పార్టీ సునాయాసంగా చేజిక్కించుకుంది. ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయిన చైర్మన్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే, చందంపేట జడ్పీటీసీ సభ్యుడు నేనావత్ బాలునాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా పెద్దవూర జడ్పీటీసీ సభ్యుడు కర్నాటి లింగారెడ్డి ఎన్నికయ్యారు.
రంగారెడ్డి జడ్పీలో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాలేదు. తెరాస, కాంగ్రెస్.. ఎవరు పీఠాన్ని దక్కించుకోవాలన్నా టీడీపీ మద్దతు తప్పనిసరయింది. మొదట ఒక ఒప్పందానికి వచ్చిన కాంగ్రెస్ - టీడీపీ మధ్య మళ్లీ అవగాహన కుదరకపోవడంతో ఆ రెండు పార్టీల సభ్యులు సభకు గైర్హాజరయ్యారు. కోరం లేకపోవడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు చూసిన కలెక్టర్ శ్రీధర్.. జడ్పీ సమావేశాన్ని ఆదివారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
ఆ తరువాత కొద్ది నిమిషాలకే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చైర్మన్ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఈసీ మొదట సోమవారం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించినా, సాయంత్రమే స్పందించడంతో 13న చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది.












Click it and Unblock the Notifications