అమరావతికి డీకే, విశాఖకు రేవంత్ - ఉద్యమానికి మద్దతు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ, జనసేన జగన్ ఓటమే లక్ష్యంగా జత కట్టాయి. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మరో వైపు కాంగ్రెస్ ఏపీలో పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తరువాత షర్మిల దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పుడు ఏపీలో షర్మిలకు మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రంగంలోకి దిగుతున్నారు.
ఎన్నికల వేళ ఏపీ కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీని బలోపేతం చేసేందుకు వరుసగా సభలు, సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్ర విభజన హామీల అమలుపై డిక్లరేషన్ ప్రకటించేందుకు ఈ నెల 7వ తేదీన గుంటూరులో బహిరంగసభ నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.

రాజధాని అమరావతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ సభలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 11న విశాఖలో బహరంగ సభ నిర్వహించనున్నారు.
విశాఖ సభకు తెలంగాణ సీఎం రేవంత్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రకటన చేసేలా నిర్ణయించారు. ఇటు అభ్యర్దుల ఖరారు పైన కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావటంతో వడబోత ప్రారంభించారు.
సామాజిక సమతుల్యత పాటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభై శాతం సీట్లు కేటాయిస్తామని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. ఈ దిశ గా కసరత్తు మొదలైందన్నారు. నిజాయతీ, విధేయత, చిత్తశుద్దే అభ్యర్దుల ఎంపికకు ప్రధాన అర్హతగా పేర్కొన్నారు. కష్టపడి పని చేసిన వారికే టికెట్లు దక్కుతాయని స్పష్టం చేసారు. మరో వారం రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్దుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications