జగన్ కు హైకోర్టులో ఊరట- ఆ సమన్లపై ఏప్రిల్ 30 వరకూ స్టే..
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో తనపై నమోదైన ఓ కేసులో నాంపల్లి కోర్టు పంపిన సమన్లపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం ఏప్రిల్ 30 వరకూ తాత్కాలిక స్టే మంజూరు చేసింది.
2014లో తెలంగాణలోని హుజార్ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో చేశారని వైఎస్ జగన్ పై కేసు నమోదైంది. ఇది కాస్తా హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ న్యాయస్దానానికి చేరింది. దీంతో కోర్టు తాజాగా మార్చి 28న హాజరు కావాలని జగన్ కు సమన్లు పంపింది. అయితే నిర్ణీత సమయంలో జగన్ కు సమన్లు అందలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.దీంతో మరోసారి సమన్లు పంపాలని కోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి జగన్ కు సమన్లు పంపారు.దీనిపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

నాంపల్లి కోర్టు ఇచ్చిన సమన్లకు కారణమైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసును కొట్టేయాలని సీఎం జగన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నాంపల్లి కోర్టుకు ఏప్రిల్ 30 వరకూ హాజరు కాకుండా స్టే మంజూరు చేసింది. ఆ తర్వాత దీనిపై విచారణ చేపట్టనుంది. ఇప్పటికే వైఎస్ జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోంది. సీబీఐతో పాటు ఈడీ నమోదు చేసిన కేసులపైనా విచారణ జరుగుతోంది. ఇందులో తీర్పు రావాల్సిఉంది.












Click it and Unblock the Notifications