TTD: తిరుమలలో వసతి గదులు లభించని భక్తుల కోసం పీఏసీ- 5
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 63,637 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,016 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.20 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏడు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచివున్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు.

శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచీ వచ్చే భక్తుల సౌకర్యం కోసం తిరుమలలో కొత్తగా మరో వసతి భవన సముదాయం అందుబాటులోకి రాబోతోంది. ఇది పిలిగ్రిమ్స్ ఎమినిటీస్ కాంప్లెక్స్ (పీఏసీ)- 5. దీని నిర్మాణం దాదాపుగా తుదిదశకు చేరుకుంది. అన్న ప్రసాదం డైనింగ్ హాల్, కళ్యాణ కట్ట, డిస్పెన్సరీ సదుపాయాలు ఇందులోనే ఉన్నాయి.
దీని నిర్మాణ పనులను టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు.. నిర్మాణ పనుల పురోగతిపై ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
16 హాళ్లతో ఈ యాత్రీకుల వసతి భవన సముదాయం నిర్మితమౌతోంది. ఇప్పటివరకు ఎనిమిది హాళ్లలో ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన ఎనిమిది హాళ్లల్లో చురుగ్గా పనులు కొనసాగుతున్నాయి. వాటిని మరింత వేగవంతం చేయాలని వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
ప్రతి ఒక్క పనికి గడువు నిర్దేశించుకుని, దానికి అనుగుణంగా పనుల వేగం పెంచాలని అన్నారు. భవనం సముదాయంలో భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఎలాంటి రాజీ పడకూడదని చెప్పారు. పీఏసీ-5లో భక్తుల కోసం నాణ్యతతో కూడిన సేవలను అందించాలని సూచించారు.
ప్రస్తుతం తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా ఈ పీఏసీ- అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications