TTD: బ్రేక్ దర్శనాలు రద్దు - వసతి పై టీటీడీ కీలక ప్రకటన..!!
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దం అవుతోంది. ఈ ఏడాది వరుసగా రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాధారణ భక్తులకు దర్శనం..సేవల్లో ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సాలికట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 12న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇదే సమయంలో వసతి పైన కీలక సూచనలు చేసింది.
టీటీడీ కీలక నిర్ణయాలు:బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల వేళ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుటోంది. అందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 12వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సెప్టెంబరు 12న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా సెప్టెంబరు 11న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది. అదే విధంగా..శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లోస్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేసింది. దాతల సిఫార్సుపై ఇతరులకు గదుల కేటాయింపు ఉండదని వెల్లడించింది.
రెండు బ్రహ్మోత్సవాలు:తిరుమలలో సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దాతలు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా గదులను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు సూచించారు. సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబరు 22న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 20 నుండి 22వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని పేర్కొన్నారు. అదేవిధంగా, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 19న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17 నుండి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని స్పష్టం చేసారు.

సేవలు రద్దు:ఒకే కాటేజిలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళం ఇచ్చిన దాతలు స్వయంగా వస్తే రెండు గదులను రెండు రోజుల పాటు కేటాయిస్తారు. ఒకే కాటేజిలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలు స్వయంగా వస్తే ఒక గదిని రెండు రోజులపాటు కేటాయించడం జరుగుతుంది.
ఈ విషయాన్ని కాటేజి దాతలు గమనించాలని టీటీడీ కోరుతోంది. బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19న గరుడవాహనం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications