తిరుమలలో ఏం జరుగుతోంది? ఫీడ్ బ్యాక్ ఇచ్చిన భక్తులు
తిరుమలలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామివారి రోజుకో వాహనసేవపై అశేష భక్తజనాన్ని కరుణిస్తోన్నారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో వేలాదిమంది భక్తులు కనులారా ఉత్సవాలను దర్శించుకుంటోన్నారు. ప్రత్యేక పూజలు చేస్తోన్నారు. శుక్రవారం సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై మలయప్పస్వామివారి ఊరేగారు.
స్వామివారి వాహన సేవకు ముందు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 18 కళా బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. మొత్తం 482 మంది కళాకారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ముత్యపు పందిరి వాహన సేవ ముందు దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులు ప్రదర్శించిన అద్భుతమైన నృత్యాలు భక్తులకు కనువిందు చేశాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అడిగి తెలుసుకున్నారు. ముత్యపు పందిరి వాహనానికి వచ్చిన భక్తులతో మాట్లాడారు. ఆలయ నాలుగు మాడ వీధులలో పలు గ్యాలరీలను ఆయన సందర్శించారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వసతి, రవాణా, కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు.
అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని, టిటిడి అందిస్తున్న సేవలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈవో మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి వారి సూచనల మేరకు సౌకర్యాలు అందిస్తామని అన్నారు. 28వ తేదీ గరుడ సేవ నేపథ్యంలో మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 67,388 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 21,998 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 1.74 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏడు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 16 గంటల సమయం పట్టింది.












Click it and Unblock the Notifications