టీటీడీ వాడి అబ్బ సొత్తా- చంద్రబాబు చెబితే నిమిషంలో రాజీనామా చేస్తా- బీఆర్ నాయుడు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. తొలుత దీన్ని డీప్ ఫేక్ వీడియోగా అభివర్ణిస్తూ ట్వీట్ చేసిన ఆయన తాజాగా ప్రెస్ ముందుకు వచ్చారు. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి, టీటీడీ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్రలు చేస్తోన్నారంటూ మండిపడ్డారు.
టీటీడీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే తనపై వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిలు చేస్తోన్నారని బీఆర్ నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకులు చెబితే తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. తనను రాజీనామా చేయమని అడగడానికి వాడెవడని పరోక్షంగా భూమన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించిఅన్నారు. వాడి అబ్బ సొత్తా టీటీడీ. టీటీడీ ఛైర్మన్ పదవి నువ్వు ఇచ్చావా? రిజైన్ చేయమని అడగడానికి.. అని ఘాటుగా విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను నియమించారని, ఆయన చెబితే రాజీనామా చేయడానికి నిమిషం కూడా పట్టదని బీఆర్ నాయుడు అన్నారు. తనను ఎందుకు రాజీనామా చేయమంటున్నాడనే విషయంపై రీసెర్చ్ చేశానని, ఆయన చేసిన దుర్మార్గాలను బయటికి వస్తోన్నాయని బీఆర్ నాయుడు ధ్వజమెత్తారు. అవన్నీ బయటికి వస్తే తిరుపతి ప్రజలే అతన్ని తరిమి తరిమి కొడతారని అన్నారు. టీటీడీ ఛైర్మన్ గా నిస్వార్థంగా, ఏదీ ఆశించకుండా పని చేస్తోన్నానని చెప్పారు.
ఓ మీడియా అధినేత, బిజినెస్ మెన్ గా ఎన్నో అవకాశాలు వస్తే వదులుకుని టీటీడీ ఛైర్మన్ పదవి కావాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేసి మరీ ఇక్కడికి వచ్చానని బీఆర్ నాయుడు అన్నారు. టీటీడీలో గత అయిదేళ్లల్లో జరిగిన స్కామ్ లన్నింటినీ కూడా బయటికి తీస్తానంటే తిరుమల పవిత్రత దెబ్బతింటుందని చంద్రబాబు వద్దంటున్నారని పేర్కొన్నారు. నీ వేషాలన్నీ నా దగ్గర నడవవు, తగ్గేదే లేదు.. అని భూమనను ఉద్దేశించి హెచ్చరించారు.
సోషల్ మీడియాలో ఏ వీడియో అయితే బయటికి వచ్చిందో ఆ కుటుంబంతో తనకు 30 సంవత్సరాలుగా పరిచయాలు ఉన్నాయని బీఆర్ నాయుడు తేల్చి చెప్పారు. వాళ్లింటికి మేం వెళ్తాం.. మా ఇంటికి వాళ్లు వస్తుంటారని అంతమాత్రానా ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. కొన్ని చోట్ల మార్ఫింగ్ చేశారని, ఆ చేసిన వాళ్లు దాన్ని సరిగ్గా కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. ఎన్నిసార్లు చూసినా ఆ వీడియోలో తప్పు కనిపించలేదని స్పష్టం చేశారు.
ఎవరో భయపడితే భయపడేవాడిని కాదని, రాజీనామా చేయమంటే చేసేవాడినీ కాదని బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వీడియోపై తాను ఇప్పటికే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశానని, దీని సంగతేంటో తేలుస్తానని అన్నారు. సతీసమేతంగా జగన్ పట్టువస్త్రాలు ఎందుకు సమర్పించట్లేదని తాను నిలదీశానని, అందుకే తనపై బురదజల్లుతున్నారని బీఆర్ నాయుడు ఆరోపించారు.












Click it and Unblock the Notifications