TTD: దర్శనాల పై ఛైర్మన్ కీలక ప్రకటన - బ్రేక్ రద్దు..!!
Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నిర్వహణ పైన అన్ని విభాగాలు సమాయత్తం అవుతున్నాయి. ఆన్ లైన్ టోకెన్లు ఇప్పటికే జారీ చేసారు. శ్రీవారి ఆలయంలో పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకుని జనవరి 7వతేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ రోజు బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. ఇక, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల పై ఛైర్మన్ నాయడు కీలక ప్రకటన చేసారు.
వారికే అనుమతి
పది రోజుల వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఆయన తిరుమలలోని శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు సంయమనం పాటించి తిరుపతిలో జారీ చేయనున్న ఎస్ఎస్ డీ టోకెన్లు పొందాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వైకుంఠ ఏకాదశికి అధికారులు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తోందని ఛైర్మన్ వివరిచారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరిం చుకుని జనవరి 7వతేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. శ్రీవారి ఆలయంలో సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జనవరి 7వ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.
బ్రేక్ దర్శనాల రద్దు
ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయా లు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా 7వ తేదీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు.












Click it and Unblock the Notifications