సీఎంలకు బీఆర్ నాయుడు ఉత్తరం- టీటీడీ కోసం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 64,861 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,639 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.65 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
స్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండనక్కర్లేదు. క్యూలైన్ల ద్వారా నేరుగా దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాలను నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా టీటీడీ తరఫున ఆధ్యాత్మక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరింపజేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించడానికి అవసరమైన స్థలాన్ని సేకరించే పనిలో పడింది టీటీడీ. ఈ క్రమంలో పాలక మండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు రంగంలోకి దిగారు. రాజధానుల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కొంతమేర స్థలాన్ని ఉచితంగా కేటాయించాని కోరుతూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తాయని బీఆర్ నాయుడు ఈ లేఖలో పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని, ఆధ్యాత్మిక వైపు అందరూ అడుగులు వేస్తోన్నారని, ప్రతి రాష్ట్ర రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండాలని అభిప్రాయపడ్డారు.
దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కోట్లాదిమంది భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇస్తోన్నారని గుర్తు చేశారు. వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications