శ్రీవారి అన్నప్రసాదంలో కొత్త వంటకం- లిమిటెడ్: దక్కాలంటే
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 63,285 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,829 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.11 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎనిమిది కంపార్ట్‌మెంటల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- శ్రీవారి అన్నప్రసాదం మెనూలో కొత్తగా చేర్చిన మసాలా వడ వడ్డింపు కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో స్వయంగా భక్తులకు వడను వడ్డించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక రుచికర ఆహార పదార్థాన్ని చేర్చాలనే ఆలోచన కలిగిందని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన అంగీకరించారని అన్నారు.
ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తోన్నట్లు బీఆర్ నాయుడు తెలియజేశారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీన, సోంపును ఉపయోగించనున్నట్లు తెలిపారు.
అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 35,000 వడలను భక్తులకు వడ్డించనున్నట్లు బీఆర్ నాయుడు చెప్పారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications