టీటీడీ ఉద్యోగులకు తీపి కబురు
టీటీడీ ఉద్యోగులకు పాలకమండలి తీపి కబురు వినిపించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంటూ వస్తోన్న వారి కీలక సమస్య.. పరిష్కారం దిశగా అడుగు పడింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో.. దీనికి దాదాపుగా తెరపడినట్టేనని భావిస్తోన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బోర్డు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సబ్‌కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది కూడా.
అదే.. హౌస్ సైట్ల అంశం. దీనికి సంబంధించి కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించే దిశగా కీలక అడుగు పడిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. హౌస్ సైట్ల కోసం సుమారు 230 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని వివరించారు. గతంలో వేసిన సబ్‌కమిటీ ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలించి, సమగ్ర ప్రతిపాదనను అందించిందని, దీన్ని టీటీడీ పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పారు.

ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వివరించారు. టీటీడీ ఉద్యోగుల ఇంటి విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని చంద్రబాబు హామీ ఇవ్వడం.. వారి సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. బ్రహ్మోత్సవాలు పూర్తయిన వెంటనే ఉద్యోగుల హౌస్ సైట్ల ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకొస్తామని అన్నారు.
టీటీడీ ఉద్యోగుల కోసం ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ కు కూడా అనుమతులు ఉన్నాయని, ప్రస్తుతం దీనిని ఫేజ్-1, ఫేజ్-2గా చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. ఈ రెండు కార్యక్రమాలు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల హౌస్ సైట్ల సమస్య పరిష్కారం దిశగా తమ పాలకమండలి ఆధ్వర్యంలో ముందడుగు పడటం సంతృప్తినిచ్చే విషయమని చెప్పారు.
టీటీడీ ఉద్యోగులు భక్తుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలకు వచ్చే భక్తులను సరైన మార్గంలో నడిపిస్తూ, వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంతో పాటు అవసరమైన వసతులను అందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి తమ బోర్డు పూర్తి సహకారం అందిస్తుందని, అదే సమయంలో టీటీడీ ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వర్తించాలని కోరారు.














Click it and Unblock the Notifications
