శ్రీవారి ఆలయంలో హుండీల పై కీలక నిర్ణయం - నేడు ఛత్రస్థాపనోత్సవం..!!
Tirmuala: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో స్టీలు హుండీల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ఒక స్టీల్ హుండీని ఏర్పాటు చేశారు. ఐదు అడుగులు ఉన్న ఈ స్టీల్ హుండిని తీసుకెళ్లి పరిశీలించారు. వినియోగం సులభంగా ఉంటే స్టీలు హుండీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ రోజు తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద జూలై 30వ తేదీ ఆదివారం ఛత్రస్థాపనోత్సవం జరుగనుంది.
స్టీలు హుండీల ఏర్పాటు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ఆలయంలో అయిదు అడుగుల స్టీలు హుండీని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రస్తుతం కొప్పెరలో భారీ గంగాళాలు ఉంచి అందులో భక్తులు కానుకలు సమర్పించేలా హుండీలు, మరికొన్ని ఇత్తది హుండీలు ఏర్పాటు చేసిన వినియోగిస్తున్నారు. వీటిని శ్రీవారి సేవకులు, బ్యాంకు పొరుగు సేవల ఉద్యోగుల ద్వారా ట్రాలీల్లో ఆలయం నుంచి బయటకు అక్కడ నుంచి లారీల్లోకి ఎక్కించి నూతన పరాకమణికి తరలిస్తున్నారు. ఇటీవల హుండీల తరలింపు తసమయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఇబ్బందులు లేకుండా
హుండీలోకి భక్తులు నగదు వేస్తున్న సమయంలో లోపలకు చేయి పెట్టి చోరీ చేసిన ఘటనలూ ఉన్నాయి. వీటికి తావివ్వకుండా స్టీలు హుండీలు సిద్దం చేస్తున్నారు. ఇందులో మూడు వైపులా భక్తులు కానుకలు వేయొచ్చు. భక్తుడి చేయి పూర్తిగా దూరే అవకాశం ఉండదు. మధ్యలో ఓ ఇనుప చువ్వ ఏర్పాటు చేసారు. వీటిని ప్రయోగాత్మకంగా అధికారులు పరిశీలిస్తున్నారు.
వినియోగం సులభంగా ఉంటే స్టీలు హుండీలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఈ రోజు ఆదివారం ఛత్రస్థాపనోత్సవం జరుగనుంది. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థాన్ని తీసుకుంటారు.
నేడు ఛత్రస్థాపనోత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో రెండవ గంట తర్వాత పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళవాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట చేరుకుంటారు. అక్కడినుండి అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారుబావి నుండి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు.
తదనంతరం వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించి, శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్టించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశినాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications