బ్రహ్మోత్సవ శోభ: తిరుపతి గరుడ సర్కిల్స్, నంది సర్కిల్స్, అలిపిరిల్లో.. !!
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల గడువు సమీపించింది. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కిందటి నెల సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసినందున అదే స్ఫూర్తితో, రాబోయే నవరాత్రి ఉత్సవాలను కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
దసరా సెలవుల కారణంగా భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, భద్రతతో పాటు రవాణా, పారిశుధ్యం తదితర విభాగాల సమన్వయంపై ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తోన్నారు. తిరుపతిని కూడా విద్యుత్ కాంతులతో సుందరంగా తీర్చిదిద్దే పనులు వేగవంతం చేశారు.

ఇందులో భాగంగా టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని గోశాలను సందర్శించారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వాహన సేవల్లో పాల్గొనే మూగజీవాల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. మూగజీవాల ఆరోగ్యం, పశుగ్రాసం లభ్యతపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం ఈ గోశాలలో సుమారు 100 గోవులు ఉండగా, వాటి ద్వారా ప్రతిరోజూ దాదాపు 90 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు.
శ్రీవారి నిత్య కైంకర్యాల కోసం ఈ పాలనే వినియోగిస్తోండటం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారికి ప్రతిరోజూ నిర్వహించే నవనీత సేవకు అవసరమైన 1.5 కిలోల వెన్నను ఈ గోశాల నుంచే సేకరిస్తోన్నామని అన్నారు. ఉత్సవాల సమయంలో ఊరేగింపుల్లో పాల్గొనే ఏనుగులు, గుర్రాలు, ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, వాటి ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సెలవుల్లో ఉన్న వెటర్నరీ నిపుణులతో సహా వైద్యులను అప్రమత్తం చేశారు.
అంతకుముందు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహించనున్న ఉద్యోగులతో తిరుమల ఆస్థాన మండపంలో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత సాలకట్ల బ్రహ్మోత్సవాల మాదిరిగానే ఈ ఉత్సవాలను కూడా టీమ్ వర్క్ ద్వారా విజయవంతం చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మాడ వీధుల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని సీవీఎస్ఓ మురళీకృష్ణ భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
అటు బ్రహ్మోత్సవాల సందడి తిరుపతిలోనూ కనిపిస్తోంది. జేఈవో డాక్టర్ ఎ శరత్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని అన్ని ప్రధాన దేవాలయాలు, టీటీడీ పరిపాలనా భవనాలు, 17 ప్రధాన సర్కిళ్లు, 14 రహదారులు, 20 ఆర్చ్ లు, ఎనిమిది పార్కింగ్ ప్రాంతాల్లో ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు చేపట్టాలని జేఈవో సూచించారు. విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు.
తిరుపతి అన్నమయ్య సర్కిల్ నుంచి అలిపిరి బైపాస్ రోడ్డు, గరుడ సర్కిల్, నంది సర్కిల్ లల్లో ఎల్‌ఈడీ తోరణాల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. టీటీడీ అడ్మిన్ భవనం, శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, లగేజ్ కౌంటర్ తదితర ప్రాంతాలను విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తాగునీరు, అన్నప్రసాదం, పారిశుధ్యం, మొబైల్ మరుగుదొడ్లు వంటి 13 ప్రాధాన్యత రంగాలపై దృష్టి సారించాలని జేఈవో శరత్ అధికారులను ఆదేశించారు.
పార్కింగ్ ప్రాంతాల్లో తగినంత వెలుతురు కోసం ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయడమే కాకుండా, భక్తులకు సమాచారాన్ని చేరవేసేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులను సిద్ధం చేస్తున్నారు. భక్తుల రాకపోకలకు వీలుగా విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
