టోకెన్ల జారీపై టీటీడీ యూటర్న్?
Tirumala: ఇటీవలే అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ భారీ మార్పులను చేపట్టింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న మొదట వచ్చిన వారికి మొదట.. విధానానికి స్వస్తి పలికింది. దీని స్థానంలో కొత్తగా లక్కీ డిప్ విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ నుండి ఈ విధానం అమలవుతోంది.
ఒకసారి అంగప్రదక్షిణం చేసిన భక్తులు మళ్లీ అదే సేవలో పాల్గొనడానికి 180 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తోందీ కొత్త విధానంలో. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గతంలో గడువు 90 రోజులు ఉండగా దీన్ని టీటీడీ 180 రోజులకు పొడిగించింది. ఈ విధానం పట్ల భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. లక్కీడిప్ ద్వారా ఆంగా ప్రదక్షిణ టికెట్ల ప్రస్తుత కేటాయింపు విధానాన్ని పునఃపరిశీలించాలని, పాత ఆన్‌లైన్ కేటాయింపు వ్యవస్థను తిరిగి అమలు చేయాలని అనేకమంది భక్తులు కోరుతున్నారు.

టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో భక్తుల నుండి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయి. అంగప్రదక్షిణం టోకెన్ల జారీలో పాత పద్ధతిని పునరుద్ధరించాలని కోరారు. దీనిపై ఈఓ సానుకూలంగా స్పందించారు. తమకు అందిన ఈ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలియజేశారు.
తాను రెండోసారి టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన 20 రోజుల్లో, ఎక్కడ పర్యటించినా - పాదచారుల మార్గాల్లో, వైకుంఠం కంపార్ట్‌మెంట్లలో, ఇటీవల జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో మాడ వీధుల్లో కూడా - చాలా మంది భక్తులు లక్కీడిప్ విధానానికి బదులుగా పాత ఆన్‌లైన్ ఆంగ ప్రదక్షిణ టిక్కెట్ల కేటాయింపు వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారని తెలిపారు. భక్తుల నుండి వచ్చే అభిప్రాయాల ఆధారంగానే, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
తదుపరి బోర్డు సమావేశంలో ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటామని సింఘాల్ హామీ ఇచ్చారు. ఇప్పుడున్న లక్కీడిప్ విధానాన్ని కొనసాగించాలా? లేక పాత ఆన్ లైన్ వ్యవస్థను పునరుద్ధరించాలా? అనే విషయంపై టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చిస్తామని, అనంతరం తుది నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. కొందరు భక్తులు దర్శన సమయంలో గర్భగుడి లోపల ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి వారందరికీ శిక్షణ ఇస్తున్నామని, ప్రవర్తనా వైఖరిని మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనం టికెట్ల కుంభకోణంలో ఓ టీటీడీ ఉద్యోగి ప్రమేయం ఉందని ఓ భక్తుడు ఆరోపించినట్లు ఈఓ సింఘాల్ తెలిపారు. భక్తులను మోసం చేసినట్లు ఎవరైనా తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, వెండి వాకిలి, బంగారు వాకిలి మధ్య రద్దీని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు సూచించినట్లు తెలిపారు.
ప్రవేశ-నిష్క్రమణ పాయింట్ల వద్ద కూడా రద్దీని తాను స్వయంగా గమనించానని ఈఓ సింఘాల్ అన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి రక్షణ కోసం మాడ వీధుల వెంట షెల్టర్ ఏర్పాటు చేయాలని మెజారిటీ భక్తులు కోరారని, దీని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని, మరో రెండు నెలల్లో మార్పును చూస్తారని సింఘాల్ చెప్పారు.












Click it and Unblock the Notifications