టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు - వచ్చే నెల వివాహం..!!
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుకు గురయ్యాడు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలతో గుండెపోటుకు గురైనట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రమౌళికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చంద్రమౌళి అకస్మాత్తుగా గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.వచ్చే నెలలో చంద్రమౌళికి వివాహం నిర్ణయించారు. ఈ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండె పోటుతో చికిత్స పొందుతున్నారు. 28 ఏళ్ల చంద్రమౌళికి వచ్చే నెలలో వివాహం జరగనుంది. తాజాగా చెన్నైకి చెందిన టీటీడీ సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్దం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరిపేందుకు నిర్ణయించారు. వివాహానికి సంబంధించి రెండు కుటుంబాలు శుభలేఖలు పంచుతున్నారు. చెన్నైలోని ఆళ్వారుపేటలో బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి చంద్రమౌళి కారులో వెళ్లారు. కాసేపటికే గుండెనొప్పిగా ఉందంటూ తన స్నేహితులకు చెప్పారు. వెంటనే కావేరి ఆస్పత్రిలో చేర్చారు. సమాచారం తెలుసుకున్న శేఖర్ రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

ధర్మారెడ్డి దంపతులు కుమారుడు గుండెపోటుకు గురైన విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్నారు. చంద్రమౌళి నెమ్మదిగా కోలుకుంటున్నారని శేఖర్ రెడ్డి చెప్పారు. చంద్రమౌళి ప్రస్తుతం ముంబాయిలో ఉద్యోగం చేస్తున్నారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. వివాహం ఖరారు కావటంతో ఆ పనుల్లో చెన్నైకి వచ్చారు. ఈ సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ధర్మారెడ్డి కుమారుడు ఆరోగ్యం పైన టీటీడీ ఛైర్మన్
సుబ్బారెడ్డి ఆరా తీసారు. గత మూడేళ్ల కాలంగా ధర్మారెడ్డి టీటీడీలో ఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు ధర్మారెడ్డి కుమారుడు ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications