తిరుమల అన్నప్రసాదంపై భక్తులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ లో..
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 82,628 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 30,339 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.25 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఆరు కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా.. తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాల నాణ్యత, రుచి గురించి ఆరా తీశారు.
భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అంతకుముందు ఈవో, అదనపు ఈవో అక్కడే అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం కియోస్క్ మిషన్ ద్వారా ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు విరాళాన్ని అందించారు. అన్నప్రసాద భవనం క్యూలైన్లు, అక్కడి పరిశుభ్రత, సరుకుల నిల్వ గది తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ముందుగా సాయంత్రం శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనులవారు ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
ఈ నెల 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అంకురార్పణ కారణంగా సోమవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే.. నేడు అష్టదళ పాద పద్మారాధన సేవ, 7న తిరుప్పావడ సేవలు రద్దయ్యాయి. దీనితో పాటు 5 నుండి 7వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications