అంత తక్కువ ధరకు కిలో నెయ్యా ? అయినా వాడలేదు- మరో బాంబు పేల్చిన టీటీడీ ఈవో..!
ఏపీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత తీవ్ర కలకలం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో శ్యామలరావు ఇవాళ స్పందించారు. లడ్డూలో వాడేందుకు ఉపయోగించిన ఆవు నెయ్యిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యి నాణ్యతను పరిశీలించే ల్యాబ్ తమ దగ్గర లేదని, అందుకే బయటికి పంపామన్నారు. తాము కాంట్రాక్టర్ ను హెచ్చరించిన తర్వాతే నెయ్యి నాణ్యత పెరిగిందన్నారు.

తిరుమల లడ్డూ తయారీ కోసం నాలుగు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిపై అనుమానం వచ్చి బయట ల్యాబ్ కు పరీక్షల కోసం పంపామని టీటీడీ ఈవో శ్యామలరావు తొలిసారి ఇలా జరిగిందన్నారు. పరీక్షల్లో జంతువుల కొవ్వులు కలిపినట్లు తేలిందన్నారు. ఆరా తీస్తే ఆవునెయ్యి కిలో రూ.320కి సరఫరా చేస్తున్నట్లు తేలిందన్నారు. అంత తక్కువ ధరకు నాణ్యమైన కిలో ఆవు నెయ్యి ఎలా ఇవ్వగలరని శ్యామలరావు ప్రశ్నించారు. కల్తీ చేసినప్పుడు మాత్రమే ఇలా చేయగలరన్నారు. టీటీడీ కల్తీని పరీక్షించే ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే రూ.75 లక్షలు అవుతుందని, అది ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలియదన్నారు.
జూలై 6న తాము ల్యాబ్ కు పంపిన నెయ్యి శాంపిల్స్ పై ఐదు పరీక్షల ఫలితాలు రెండు భాగాలుగా వచ్చాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఇందులో నెయ్యి నాణ్యత 100 పాయింట్లకు బదులు 20 పాయింట్లే ఉందన్నారు. కాబట్టి జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపినట్లు ఎన్డీడీబీ తేల్చిందన్నారు. ఈ నివేదిక రాగానే చర్యల కోసం కమిటీని నియమించినట్లు ఈవో తెలిపారు. అలాగే ఆ నెయ్యి వాడకం ఆపేసినట్లు ఈవో తెలిపారు.
మరోవైపు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతామని కాంట్రాక్టర్ ను కూడా హెచ్చరించామన్నారు. ఆ తర్వాతే నెయ్యి నాణ్యత పెరిగిందని ఆయన వివరించారు. లడ్డూ పోటు సిబ్బందితో పాటు నిపుణులు కూడా ఇప్పటికే నెయ్యి నాణ్యతపై తమకు ఫిర్యాదులు చేశారని టీటీడీ ఈవో వెల్లడించారు.












Click it and Unblock the Notifications