తిరుమల పరకామణి కేసులో కీలక మలుపు..!!
తిరుమల పరకామణి కేసు విచారణ కీలక దశకు చేరింది. సీఐడీ విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. టీటీడీ మాజీ ఈవోను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారణ చేసారు. పరకామణి కేసులో ఇప్పటికే రెండు సార్లు ధర్మారెడ్డిని సీఐడీ రెండు సార్లు విచారణ చేసింది. ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని మరోసారి సీఐడీ విచారణకు పిలిచింది. ఇప్పుడు ఈ కేసు కీలక మలుపు తీసుకుంది.
సంచలనంగా మారిన టీటీడీ పరకామణి కేసులో దర్యాప్తు అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి టీటీడీలో కీలక హోదాల్లో పని చేసిన ఈవోలు, ఛైర్మన్లను అధికారులు విచారించారు. ప్రస్తుతం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీఐడీ మూడో సారి విచారణ చేసింది. దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. ప్రధానంగా పరకామణిలో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని రక్షించేందుకు గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులే దగ్గరుండి వ్యవహారాన్ని నడిపించారని, చివరకు కేసు పెట్టినా కూడా లోక్‌అదాలత్‌లో కొట్టివేసే విధంగా ఒత్తడి తెచ్చారని, దీనికి సంబంధించి లక్షల్లో చేతులు మారాయనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని కోణాల్లో దర్యాప్తు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

గత రెండు సార్లు విచారణకు హాజరైన ధర్మారెడ్డి చెప్పిన అంశాలు.. భూమన విచారణ సమయంలో సేకరించిన సమాచారం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ఇద్దరు చెప్పిన విషయాలను సీఐడీ అధికారులు రికార్డు చేసారు. అదే విధంగా పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ మరణం కూడా మిస్టరీగా మారింది. దీంతో పరకామణి వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి.. ఎవరెవరు ఇందులో పాత్రధారులుగా ఉన్నారు?.. ఎవరెవరు ఏ అంశాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారనే అంశాలపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు. అప్పటి టీటీడీ విజిలెన్స్ ఎస్సై సతీశ్ కుమార్ ఫిర్యాదుతో తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అదే ఏడాది మే 30న రవికుమార్‌పై విజిలెన్స్ అధికారులు చార్జ్‌షీట్ ఫైల్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలతో సీఐడీ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక ఇవ్వాల్సి ఉంది. దీంతో.. ఇప్పుడు సీఐడీ కోర్టుకు ఏం నివేదించబోతుందనేది ఈ కేసులో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications