తిరుమలలో నెల రోజుల్లో విశేషంగా..
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. శ్రావణమాసం చివరి శనివారం కావడం వల్ల భక్తులు తిరుమలకు పోటెత్తారు. 81,207 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,414 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.53 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అయిదు కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
దీనికోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి తిరుమలలో. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. రోజూ లక్షమంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు.
కాగా- సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే పర్వదినాలు, విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ప్రతి నెలలో శ్రీవారికి నివేదించే కార్యక్రమాలు, పండగలు, వివిధ విశేష ఉత్సవాలకు సంబంధించిన జాబితాను సంబంధిత నెల ప్రారంభానికి ముందే విడుదల చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు అధికారులు.
ఇందులో భాగంగా సెప్టెంబర్‌లో నిర్వహించే పండగల జాబితాను విడుదల చేశారు. 5వ తేదీన బలరామ జయంతి నిర్వహిస్తారు.అదే రోజున వరాహ జయంతి వేడుకలను చేపడతారు. 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక వేడుకలను జరుపుతారు. సెప్టెంబరు 17వ తేదీన అనంత పద్మనాభ వ్రతం, 18వ తేదీన పౌర్ణమి గరుడసేవ, 28న సర్వ ఏకాదశిని నిర్వహించనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications