TTD: అన్న ప్రసాద విరాళాల దాతల కోసం టీటీడీ కీలక నిర్ణయం..!!
Tirumala: టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా శ్రీవారి దర్శనానికి వచ్చే వృద్ధుల కోసం వయో పరిమితి తగ్గింపు పైన కసరత్తు కొనసాగు తోంది. అదే విధంగా అన్న ప్రసాదం ట్రస్టుకు రూ లక్ష లోపు విరాళం ఇవ్వాలని భావించే భక్తుల కోసం కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. జనవరి నెలలో తిరుమలలో ప్రత్యేక కార్యక్ర మాల నిర్వహణ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
65 నుంచి 60 కి తగ్గింపు ప్రతిపాదన
టీటీడీ తాజాగా కీలక ప్రతిపాదన పైన కసరత్తు చేస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే వృద్ధుల వయో పరిమితి పైన టీటీడీకి అభ్యర్ధనలు వచ్చాయి. ప్రస్తుతం 65 ఏళ్ల వయసు నుంచి వారి వయసు 60 కి తగ్గించాలని కోరుతున్నారు. రానున్న బోర్డ సమావేశంలో ఈ ప్రతిపాదన పైన సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక, ఇదే సమయంలో అన్న ప్రసాదానికి విరాళం ఇచ్చే దాతల సౌకర్యార్ధం టీటీడీ తిరుపతి, తిరుమలతో పాటుగా అన్ని టీటీడీ దేవాలయాల్లో డిజిటల్ విధానం అందుబాటులోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది.

అన్న ప్రసాద విరాళాల కోసం
టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1 నుండి రూ.లక్షలోపు విరాళం ఇవ్వదలచిన భక్తుల కోసం సులభతరంగా విరాళం ఇచ్చేందుకు వీలుగా తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్లు(సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్ లైన్ పేమెంట్) ఏర్పాటు చేసారు.ఈ మిషన్ల ద్వారా అన్న ప్రసాదం ట్రస్టుకు 50 రోజుల్లో రూ.55 లక్షలు విరాళం అందింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయంలో కూడా ఈ మిషన్లు ప్రారంభించారు. ఈ మూడు ఆలయాల్లో ఈ మిషన్ల ద్వారా 15రోజుల్లో రూ.5 లక్షలు విరాళంగా అందింది.
వైకుంఠ ఏకాదశి దర్శనాలు
పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో కూడా ఈ కియోస్క్ మిషన్ ను ప్రారంభించారు. మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులో తీసుకురానున్నారు. ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం ఉంది. త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.












Click it and Unblock the Notifications