TTD: తిరుమల శ్రీవారి గరుడసేవ, లక్షల్లో భక్తులు వస్తారని అంచనా
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
అదేవిధంగా రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 12వ తేదీ విజయదశమినాడు రాత్రి 7.45 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. నవరాత్రి ఉత్సవాల కారణంగా బుధవారం నుంచి 10 రోజుల పాటు కల్యాణోత్సవం సేవను రద్దు చేయడమైనది. అదేవిధంగా అక్టోబరు 4వ తేదీ, 11వ తేదీలలో లక్ష్మీపూజ, అక్టోబరు 12వ తేదీన ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది.
తిరుమల గరుడసేవకు భారీ ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్టోబరు 8వ తేదీన జరిగే గరుడసేవకు లక్షలాదిగా శ్రీవారి భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేసి దృష్టి సారించి ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ అదనపు ఈవో వెకంయ్య చౌదరి గరుడ సేవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
అందులో భాగంగా వాహనముల ముందు ప్రదర్శించే వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక బృందాల ప్రదర్శనలకు సంబంధించిన వీడియోను అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆ తర్వాత టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నప్రసాదం విభాగం రూపొందించిన నాలుగు మాడ వీధులలో అన్న ప్రసాద వితరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కూడా అధ్యయనం చేశారు.
ఇందులో అన్నప్రసాదాల తయారీ, పంపిణీ మార్గాలు, గ్యాలరీలలో ఉన్న భక్తులకు సజావుగా అన్నప్రసాదాలు పంపిణీ అయ్యేలా ఇతర విభాగాలతో సమన్వయం చేయడం వంటివి ఉన్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని, గ్యాలరీల్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ అందివ్వాలని టీటీడీ ఈవోశ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications