తిరుమల భక్తుల కోసం TTD కొత్త యాప్ - సకల సమాచారం..!!
తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల వేళ సామాన్య భక్తులకు దర్శనం కోసం టీటీడీ ప్రత్యేకంగా టికెట్లను విడుదల చేసింది. పది నిమిషాల సమయం లోనే 60 వేల టికెట్లు పూర్తయ్యాయి. ఇక.. గరుడ సేవ రోజున భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో.. తిరుమలకు వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించింది. ఇక.. భక్తుల కోసం టీటీడీ కొత్తగా సకల సమాచారంతో కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది.
తిరుమలలో భక్తుల సదుపాయాలు పెంచేందుకు టీటీడీ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా, బ్రహ్మోత్సవాల వేళ భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. వీఐపీ బ్రేక్ దర్శనాల తో పాటుగా పలు సేవలను రద్దు చేసింది. గరుడ వాహన సేవ రోజున తిరుమలకు వాహనాలను అనుమితించకుండా.. తిరుపతిలోనే పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. ఇక.. భక్తుల కు తిరుమలలో పూర్తి సమాచారం అందించేందుకు వీలుగా టీటీడీ కొత్త యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు ఎవరి సహాయం లేకుండా, వెళ్లాల్సిన ప్రాంతానికి సులువుగా చేరుకునేలా 'గరుడ మ్యాప్' పేరిట టీటీడీ ఓ యాప్‌ను రూపొందించింది. తిరుమల క్షేత్రానికి సంబంధించిన సకల సమాచారంతో ప్రత్యేకంగా ఈ యాప్‌ను రూపొందించారు. భక్తుడు ఏ ప్రాంతానికి వెళ్లాలనుకున్నా యాప్‌లో ఆ ప్రదేశం పేరు నమోదు లేదా వాయిస్ కమాండ్ ఇస్తే ఆ ప్రాంతానికి తేలికగా చేరుకోవచ్చు.

బ్రహ్మోత్సవాల వేళ కీలక నిర్ణయాలు
తిరుమలకు వచ్చిన భక్తులకు టీటీడీ అందించే అన్ని సేవలు ఇందులో ఉంటాయి. భక్తులు తలనీలాలు ఇవ్వాలనుకుంటే యాప్‌లో నమోదు చేసిన వెంటనే తిరుమలలో ఉన్న కల్యాణకట్ట లన్నీ యాప్‌లో కనిపిస్తాయి. అక్కడికి చేరుకునే మార్గాలన్నీ డిస్‌ప్లే అవుతాయి. నడిచి వెళితే ఎంత దూరం, వాహనంలో వెళితే ఎంత దూరం, చేరుకోవడానికి పట్టే సమయం కూడా కనిపిస్తుంది. అంతేకాదు తక్షణమే సులువుగా చేరుకునే మార్గాన్ని కూడా సూచిస్తుంది. ఇలా వివిధ రకాల దర్శనాల ప్రవేశాలు, క్యూకాంప్లెక్స్‌లు, లడ్డూ కేంద్రం, అతిథిగృహాలు, ఫుడ్ కౌంటర్లు, తాగునీటి కేంద్రాలు, వైద్య కేంద్రాలు తదితర విభాగాల పూర్తి సమాచారాన్ని ఈ యాప్ ద్వారా పొందే విధంగా రూపకల్పన చేసారు. ఇప్పటికే టీటీడీ యాప్ తో పాటుగా నందకం యాప్ భక్తుల కు అందుబాటులో ఉంచారు. తాజాగా మరో యాప్ సిద్దమైంది.













Click it and Unblock the Notifications
