తిరుమలలో రద్దీ- భక్తులకు విజ్ఞప్తి చేసిన టీటీడీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు తోడు కావడం వల్ల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. ఆదివారం నాడు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80 వేలు దాటింది. 82,746 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,078 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.85 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏడు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు అదనపు ఏర్పాట్లు చేపట్టారు. వేసవిలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తక్షణ చర్యలకు దిగారు. నారాయణగిరి సహా ఇతర షెడ్ల వద్ద నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేపట్టారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు.
భక్తుల సంఖ్యను క్రమబద్దీకరిస్తోన్నారు. ఇందులో భాగంగా- శ్రీవారి దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సర్వదర్శన క్యూలైన్లను పరిశీలించారు.

టీబీసీ, ఏటీసీ వద్ద క్యూలైన్లలో భక్తులకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. క్యూ లైన్లలోని భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయడానికి అందుబాటులోకి తీసుకొచ్చిన మొబైల్ ఫుడ్ వెహికల్స్‌ను పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్న ప్రసాదాలు అందించాలని వారిని ఆదేశించారు.
క్యూ లైన్లల్లో టీటీడీ కల్పించే సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మొబైల్ ఫుడ్ వెహికల్స్ ద్వారా భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందిస్తున్నామని వెంకయ్య చౌదరి తెలిపారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు వారికి కేటాయించిన స్లాట్‌లోనే క్యూలైన్లలోకి ప్రవేశించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications