తిరుమలపై ఎల్‌నినో ప్రభావం, నీటి కష్టాలు- 90 రోజులకే నిల్వలు..సరఫరాలో కోత..!!
తిరుమలలో ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది. నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి తిరుమలకు నీటి కష్టాలు తప్పేలా లేవు. ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కొండపై ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పడిపోతు నాయి. ఇదే సమయంలో భక్తుల రద్దీ పెరిగి నీటి వినియోగం సైతం గణనీయంగా పెరిగటంతో సమస్యగా మారింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు మరో 90 రోజులకు మాత్రమే సరిపోతాయని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
తిరుమల కొండపై ఉన్న ప్రధాన జలాశయాలలో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోతు యి. ప్రతిరోజూ ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తులకు తాగునీటి కొరత లేకుండా చూడటం అధికారులకు ఇప్పుడు ఒక సవాలుగా మారింది. పెరుగుతున్న రద్దీ వేళ తిరుమలలోని వ్యాపార సముదాయాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కొండపై ఉన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు నీటి సరఫరాలో భారీగా కోత విధించినట్లు తెలుస్తోంది. తిరుమల కొండపై ఉన్న సుమారు 7,500 అద్దె గదులు, ఐదు భారీ యాత్రికుల వసతి సముదాయాలు, టాయిలెట్లు, నిత్యాన్నప్రసాదం తదితర అవసరాల కోసం ప్రతిరోజూ దాదాపు 60 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగి స్తున్నారు. ఈ అవసరాల కోసం పాపవినాశనం డ్యామ్ నుంచి 15 లక్షల గ్యాలన్లు, గోగర్భం నుంచి 15 లక్షల గ్యాలన్లు పంపింగ్ చేస్తుండగా.. తిరుపతిలోని కల్యాణి డ్యామ్ నుంచి మిగిలిన 30 లక్షల గ్యాలన్ల నీటిని పైప్‌లైన్ ద్వారా కొండపైకి తరలిస్తున్నారు.

వర్షాల పై టీటీడీ అంచనాలు
కాగా, తిరుమల కొండపై ఉన్న ప్రధాన జలాశయాలైన పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల నుంచి నీటి సరఫరా జరుగుతుంటుంది. అయితే, వర్షాలు సరిగా లేకపోవడంతో కుమారధార, పసుపుధార డ్యామ్‌లలో నీటి మట్టం ఇప్పటికే పూర్తిగా అడుగంటిపోయింది. ప్రస్తుతం పాపవినాశనం, గోగర్భం డ్యామ్‌లలో ఉన్న నీటి నిల్వలు కేవలం రాబోయే 90 రోజులకు మాత్రమే సరిపోతాయని చెబుతున్నారు. అయితే, వారం రోజుల్లో తిరుమల ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి ఏటా చివరి త్రైమాసికంలో తిరుమలలో వర్షపాతం విస్తారంగా నమోదువుతుందని, వర్షాలు పడితే జలాశయాలు మళ్లీ నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.













Click it and Unblock the Notifications
