శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం- ప్రత్యేకత..!!
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ రోజు (శుక్రవారం) ముందుగా బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.
కాగా, పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. చిన్నజీయర్‌స్వామి, ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు. తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో "పరివట్టం"(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి 'నిత్యైశ్వర్యోభవ' అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు పెద్ద జీయంగారికి, చిన్న జీయంగారికి, టీటీడీ తరఫున ఈవోకి 'లచ్చన' అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు.

ఆణివార ఆస్థానం ప్రత్యేకత
"రూపాయి" హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగిసింది. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్ నెలలకు మార్చారు. సాయంత్రం పుష్పపల్లకీపై స్వామి, అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.












Click it and Unblock the Notifications