TITMS: ఇకపై తిరుమలలో అవి తప్పనిసరి..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గురువారం నాడు 58,637 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,956 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.69 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తిరుమలలో రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాల రద్దీపై టీటీడీ అధికారులు ఎట్టకేలకు దృష్టి సారించారు. వాహనాల పార్కింగ్, వాటి నియంత్రణ కోసం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రత్యేకంగా తిరుమలలో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (టీఐటీఎంఎస్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వాహనాల రద్దీపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. ఇందులో సీవీఎస్వో శ్రీధర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చించారు.
ఏపీఎస్ఆర్టీసీ సహా టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, రవాణా విభాగాల జనరల్ మేనేజర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని వెంకయ్య చౌదరి ఆదేశించారు. వారం రోజుల్లోగా వాహనాల రద్దీని నివారించడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు.
తిరుమలలో వాహనాల రాకపోకలు అధికంగా ఉండే గోకులం, ఏటీసీ, రామ్ బగీచా వంటి మరిన్ని ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. తిరుమలకు రావడానికి భక్తులు వినియోగించే ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలను కేటగిరీలుగా విభజించాలని వాటికి బోర్డులు నిర్ధుష్ట పార్కింగ్ ప్రదేశాన్ని నిర్దేశించాలని ఆదేశించారు.
తిరుమలలో భవిష్యత్తులో చేపట్టబోయే నిర్మాణాల్లో పార్కింగ్ సౌకర్యం తప్పనిసరి చేయాల్సి ఉంటుందని, అలాగే- మల్టీ లెవెల్ పార్కింగ్ స్థలాలను నిర్మించాల్సిన అవసరం ఉందని వెంకయ్య చౌదరి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని, వాటిని అతిక్రమించే ట్యాక్సీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications