కల్యాణోత్సవాల నిర్వహణకు టీటీడీ ఎంఓయూలు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 85,740 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 35,555 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.41 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

శ్రీనివాస కల్యాణోత్సవాలను మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి టీటీడీ కసరత్తు మొదలుపెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు, విధి, విధానాలు రూపొందించాలని నిర్ణయించింది. దీనిపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు తాజాగా సమీక్ష నిర్వహించారు.
టీటీడీ పరిపాలనా భవనంలో ఈ సమావేశం ఏర్పాటైంది. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీ వీరబ్రహ్మం, ఇతర విభాగాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడారు. కలియుగ దైవం శ్రీనివాసుడి వైభవాన్ని మరింత విశ్వ వ్యాప్తం చేసేందుకు శ్రీనివాస కల్యాణోత్సవాలను చేపడుతున్నామని అన్నారు.
టీటీడీ ప్రతిష్ట మరింత పెంచేలా కల్యాణోత్సవాల నిర్వహణకు విధి విధానాలను రూపొందించాలని కల్యాణోత్సవం ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. శ్రీనివాస కల్యాణోత్సవాలను వ్యాపార దృక్పధంతో కాకుండా భక్తి భావంతో నిర్వహించే సంస్థలు, నిర్వహణ వ్యక్తుల ఎంపిక ఉండాలని సూచించారు.
ఏ ప్రాంతంలో కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు?, ఆర్థిక, న్యాయపరమైన తదితర అంశాలపై ముందుగా ఎంవోయూ చేసుకునేలా పటిష్ట నియమాళిని రూపొందించాలని శ్యామలరావు అన్నారు. ఇప్పటికే ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలను విదేశాల్లో నిర్వహిస్తున్న క్రమంలో ప్రణాళికా బద్ధంగా శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
విదేశాల్లో కల్యాణోత్సవాల నిర్వహణలో చేయవలసిన పనులు, చేయరాని పనుల జాబితాను రూపొందించి, అందుకు అనుగుణంగా పటిష్టంగా నిర్వహణకు నిబంధనలు తయారు చేయాలని చెప్పారు. అనంతరం తిరుమలలో వ్యర్థాల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఈవో, వ్యర్థాల నిర్వహణలో టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications