శ్రీవాణి ట్రస్ట్లో సమూల మార్పులు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. శుక్రవారం నాడు 70,970 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 33,871 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.56 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్రష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- శ్రీవాణి ట్రస్ట్ లో మార్పులు చేర్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను పునఃసమీక్షించుకుని మరింత మెరుగ్గా, సులభతరంగా, పారదర్శకంగా ఉండేలా వాటిని తయారు చేయాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు అధికారులను ఆదేశించారు.
శ్రీవాణి ట్రస్ట్ కార్యకలాపాలు, విధి విధానాలు, మార్గదర్శకాలపై టీటీడీ పరిపాలనా భవనంలో ఆయన సమీక్ష నిర్వహించారు. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జాయింట్ ఈవో వీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ టీవీ సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని మరింత విస్తృతంగా జనంలోకి తీసుకుని వెళ్లడానికి ఆలయాల నిర్మాణాలు పునాదుల్లాంటివని వ్యాఖ్యానించారు. ఆలయాల నిర్మాణాలతో దైవచింతన, ఆధ్యాత్మికత, సేవ- సమభావంతో మానవ సంబంధాలు మరింత బలపడతాయని అన్నారు.
ఇప్పటికే సమరస్వత సేవా పౌండేషన్, దేవాదాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ఆలయాల ప్రస్తుత స్థితి, జీర్ణోద్ధారణ పనులు ఏ దశలో ఉన్నాయో నివేదిక తయారు చేయాల ఈఓ ఆదేశించారు. పూర్తి అయిన ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు, నిర్వహణ అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
ఆలయాల నిర్మాణం కొనసాగుతున్నపుడు, పూర్తయిన తరువాత వాటి నిర్వహణను తరచూ తనిఖీ చేస్తుండాలని ఈఓ.. అధికారులను ఆదేశించారు. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల నిర్వహణకు పక్కాగా ప్రణాళికలు, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల నిర్వహణకోసం ప్రత్యేకంగా యంత్రాంగాన్ని రూపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications