మూడు జోన్లుగా తిరుమల
తిరుమలలో భక్తుల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు టీటీడీ పెద్ద పీట వేస్తోంది. రోజుకు సగటున 80,000 నుండి లక్ష మంది భక్తులు సందర్శిస్తున్న నేపథ్యంలో సుమారు 4.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు సమర్థంగా కొనసాగిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడానికి తిరుమలను మూడు జోన్లుగా, ఏడు వార్డులుగా విభజించింది. దీని ఆధారంగా ఎప్పటికప్పుడు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తోంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లను నియంత్రించి నో స్టాక్- నో గోడౌన్ లైసెన్సులను జారీ చేస్తోంది. వార్డు 1లో శ్రీవారి ఆలయం పరిధిలో విభాగ సిబ్బంది ప్రత్యక్షంగా పనిచేస్తుండగా, వార్డు-2 నుండి 7 వరకు పారిశుద్ధ్య పనులు మూడు కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించింది. తిరుమలలో చెత్త సేకరణకు తొమ్మిది టిప్పర్లు పనిచేస్తున్నాయి.

రోజుకు సుమారు 45 ట్రిప్పుల మేర సుమారు 3,056 బిన్స్ నుండి చెత్త సేకరణ జరుగుతోంది. అన్ని వాహనాలు కలిపి రోజుకు సుమారు 400 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాయి. గత ఏడాది 16,689.04 మెట్రిక్ టన్నుల బయోడిగ్రేడబుల్, 8,221.97 మెట్రిక్ టన్నుల నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వార్డు వారీగా విస్తృతంగా మరుగుదొడ్ల బ్లాకులు ఏర్పాటు చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే పలు ప్రాంతాల్లో మొబైల్ వాటర్ డ్రమ్స్ ద్వారా శ్రీవారి సేవకులతో తాగునీరు పంపిణీ చేస్తోంది టీటీడీ. 1981లో టీటీడీ ఏర్పాటు చేసిన వాటర్ అండ్ పుడ్ అనాలసిస్ ల్యాబొరేటరీ ద్వారా నీరు, ఆహారం నాణ్యతను పరీక్షిస్తోన్నారు. దీనికి అదనంగా ఇటీవల కొత్తగా అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ఏర్పాటైంది. తిరుమలలో టీటీడీ ఆరోగ్య విభాగం అందిస్తున్న నాణ్యమైన పారిశుద్ధ్య సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు చెత్తను సేకరించడం, మరుగుదొడ్లను నిత్యం పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యల పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారని టీటీడీ చెబుతోంది. తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, తిరుమలలో పారిశుద్ధ్య, చెత్త నిర్వహణ, మరుగుదొడ్ల సదుపాయాలు, ఆహార భద్రతను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోన్నామని, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి, భక్తులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా పని చేస్తోన్నామని తెలిపింది.












Click it and Unblock the Notifications