తిరుమలలో అరుదైన ఘట్టం: ఆర్జిత సేవలు రద్దు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 78,873 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,065 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.85 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేపట్టారు. మార్చి 9 నుండి 13వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో శ్రీమలయప్ప స్వామి- శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో వివిధ అవతారాల్లో తెప్పపై విహరిస్తారు. భక్తులకు దర్శనం ఇస్తారు.
తెప్పోత్సవాల్లో తొలిరోజు అంటే మార్చి 9వ తేదీన శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షిస్తారు. రెండవ రోజు రుక్మిణీ సమేతుడై శ్రీకృష్ణస్వామి తెప్పలపై విహరిస్తారు. మూడవ రోజు భూ సమేతంగా మలయప్పస్వామివారు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు.
ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు అయిదుసార్లు, చివరి రోజు ఏడుసార్లు పుష్కరిణిలో తెప్పపై విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఈ తెప్పోత్సవాలను దృష్టిలో పెట్టుకుని మార్చి 9, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications