తిరుమలలో వడ ప్రసాదాల తయారీ కోసం..
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రసాదాల తయారీకి దాతలు తమ భక్తిని చాటుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన పుష్కర్ ప్రాపర్టీస్ సంస్థ కృతివాసన్ తిరుమల శ్రీవారి ఆలయ పోటుకు భారీ విరాళాన్ని అందించారు. ఆలయంలో నివేదించే వడ ప్రసాదం తయారీ కోసం నాలుగు స్టవ్ లను టీటీడీకి అందజేశారు. దీనివల్ల వడల తయారీ మరింత సులభతరమౌతుందని టీటీడీ చెబుతోంది.
ఈ కార్యక్రమం తిరుమలలో శాస్త్రోక్తంగా పూర్తయింది. పుష్కర్ ప్రాపర్టీస్ తరఫున ఆ సంస్థ ప్రతినిధి మురళి వీటిని తిరుమలకు తీసుకొచ్చారు. శ్రీవారి ఆలయ పోటు విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి మునిరత్నానికి వీటిని అప్పగించారు. భక్తులకు వడ్డించే అన్నప్రసాదాల మెనూలో వడను చేర్చిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ వేల సంఖ్యలో వడలను సిద్ధం చేయాల్సి ఉంటుంది.. శ్రీవారి పోటు విభాగం సిబ్బందికి.

తాజాగా అందిన ఈ స్టవ్ ల వల్ల వీటి సంఖ్యను మరింత పెంచే అవకాశాలు లేకపోలేదు. శ్రీవారి ఆలయం పెద్దపోటులో ప్రత్యేక పద్ధతుల్లో ప్రసాదాల తయారీ జరుగుతుంటుంది ప్రతి రోజూ. ఇక్కడ వినియోగించే ప్రతి వస్తువు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఈ అధునాతన స్టవ్ లు వడలను మరింత వేగంగా, రుచికరంగా తయారు చేయడానికి అనువుగా ఉంటుందని మునిరత్నం చెప్పారు. ఈ పరికరాలు పోటులోని సిబ్బందికి శ్రమను తగ్గించడంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తాయని పేర్కొన్నారు.
కాగా.. తిరుమలలో రద్దీ నెలకొంది. గురువారం నాడు 78,026 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,166 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 5.12 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.21 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 3.13 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 2,962 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. పెరటాసి మాసంతో పాటు వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తోన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1,2, నారాయణగిరి షెడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.












Click it and Unblock the Notifications
