తిరుమలలో నీటి నిల్వలపై టీటీడీ కీలక ప్రకటన, భక్తులకు సూచనలు..!!
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఎల్ నినో వేళ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక, తిరుమలలోనూ నీటి నిల్వలు తగ్గుతున్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు రాకుండా టీటీడీ చర్యలు ప్రారంభించింది. తిరుమలకు నీటి వనరుల నిల్వల పైన ఫోకస్ చేసింది. వర్షాలు పడకుంటే ప్రత్యామ్నాయాల పైన కసరత్తు చేస్తోంది. ఈ సమయంలోనే తిరుమలకు నీటి సరఫరా చేసే డ్యామ్ లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. నీటి నిల్వల పైన కీలక ప్రకటన చేసారు.
తిరుమలలో భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట చర్యలు చేపడుతోందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. బోర్డు సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి తిరుమలకు నీటిని సరఫరా చేసే డ్యామ్‌లు, నీటి నిల్వలను పరిశీలించి సమీక్షించారు. తిరుమలకు నీటి సరఫరా అందించే డ్యామ్‌లను స్వయంగా పరిశీలించి నీటి నిల్వలపై సమీక్షించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు మార్చి, ఏప్రిల్ నెలల వరకు సరిపోతాయని వెల్లడించారు. ఒకవేళ వర్షాలు కురవని పరిస్థితి ఏర్పడితే చేపట్టాల్సిన ప్రత్యామ్నా య చర్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల జరిగిన సమావేశంలో తిరుమల నీటి అవసరాల అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, వర్షాలు కురుస్తాయని, నీటి కొరత ఉండదని ఆయన విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

పొదుపు పై భక్తులకు సూచనలు
కాగా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కళ్యాణి డ్యామ్ లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రూపొందిస్తా మని వెల్లడించారు. అదే విధంగా తిరుమలలోని డ్యామ్ లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు రాబోయే 150 రోజులకు సరిపోతాయని ఏఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. తిరుమలలో రోజువారీ నీటి అవసరం 50 లక్షల గ్యాలన్లు కాగా, ఇందులో 50 శాతం టీటీడీ సొంత డ్యామ్‌ల నుంచి, మిగిలిన 50 శాతం కళ్యాణి డ్యామ్ నుంచి వినియోగిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కురిసే వర్షాలతో డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందన్నారు. అన్ని డ్యామ్‌లు నిండితే సుమారు ఏడాదిన్నర పాటు తిరుమలలో నీటి ఎద్దడి ఉండదని పేర్కొన్నారు. తిరుమలలో నీటి వృథాను అరికట్టి పొదుపుగా వినియోగించేందుకు భక్తులకు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కాటేజీలు, గదుల్లో నీటి లీకేజీలను అరికట్టడంతో పాటు ఆటోమేషన్ గేట్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
