టీటీడీ బోర్డు సభ్యుల శ్రీవారి దర్శన, సేవా టికెట్ల కోటా పెంపు..!!
తిరుమలలో బోర్డు సభ్యులకు ప్రాధాన్యత పెరగనుంది. ఇప్పటి వరకు బోర్డు సభ్యులకు శ్రీవారి దర్శన.. సేవా టికెట్ల కోటాను పెంచాలని నిర్ణయించారు. అదే విధంగా ఎమ్మెల్యేలకు ఇచ్చే కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న జరిగే కొత్త పాలక మండలి తొలి సమావేశంలో టీటీడీలో చేపట్టే పలు సంస్కరణలతో పాటుగా బోర్డు సభ్యులు, ఎమ్మెల్యేల దర్శన ..సేవా కోటా టికెట్ల పెంపు పైన నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనున్నారు.
బోర్డు సభ్యుల కోటా
టీటీడీ నూతన పాలక వర్గం కొలువు తీరింది. ఈ నెల 18న తొలి సమావేశం తిరుమలలో జరగనుంది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులతో పాటుగా ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ఉన్న శ్రీవారి దర్శన, సేవా టికెట్ల కోటా పెంపు పైన నిర్ణయం తీసుకోన్నారు. బోర్డు సభ్యులకు ఇక నుంచి సోమవారం నుంచి గురువారం వరకు ప్రతీ రోజు 20 బ్రేక్ దర్శన టికెట్లు, శని..ఆది వారాల్లో 12 చొప్పున జారీ చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా.. వారానికి నాలుగు కళ్యాణోత్సవం.. మరో నాలుగు సుప్రభాతం సేవల టికెట్లు బోర్డు సభ్యుల కోటాలో మంజూరు చేస్తూ నిర్ణయానికి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల కోటా
ఇటు ఎమ్మెల్యేల కోటా పైన ఇప్పటికే సూత్ర ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు కు ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు ఆమోదం తెలిపారు. ఇక పై వారంలో ఆరు రోజులు పాటు, రోజుకి ఆరు చొప్పున సుపథం (రూ.300 టికెట్‌లు) ఇవ్వనున్నారు. తిరుమల దర్శనాలకు సంబంధించి ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అనుమతిస్తున్నారు. తాజా నిర్ణయం మేరకు ఇకపై వాటిని ఆరు రోజులకు అనుమతించనున్నారు. అదే విధంగా సేవల్లోనూ వారి కోటా ఉండే విధంగా మార్పులకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.
దివ్య దర్శనం టోకెన్లు
తెలంగాణ ఎమ్మెల్యేలు సైతం తమ లేఖల గురించి ఏపీ ప్రభుత్వానికి చేసిన వినతుల పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా.. దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శన విధానంలో పాత విధానాలు పునరుద్దరించే అవకాశాలు ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు 2008లో దివ్య దర్శనం పేరిట టోకెన్లను ఇచ్చేవారు. అలిపిరి మార్గంలో రోజుకు 14 వేల టోకెన్లు, శ్రీవారి మెట్టులో 6 వేలు జారీ చేయాలని 2017లో నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ పేరుతో గతంలో వాటిని నిలిపేసింది. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లను ఇస్తోంది. అలిపిరిలోనూ వీటిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ నిర్ణయం పైనా బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications