తిరుమల, తిరుపతి ఆలయాల్లో పండగ శోభ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 75,916 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 42,920 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.87 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ట్రావెలర్స్ బంగళా వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

మంగళవారం తిరుమల, తిరుపతి ఆలయాల్లో ఆణివార ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతి శ్రీగోవింద రాజస్వామి ఆలయం, శ్రీకోదండరామాలయంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది టీటీడీ. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు.
తిరుమల తిరుపతి పాలక మండలి ఏర్పాటు కాకముందు ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచే టీటీడీ వార్షిక బడ్జెట్ ఆరంభం అయ్యేది. ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, డిపాజిట్లు, వార్షిక లెక్కలు ప్రారంభం అవుతుండేది. పాలక మండలి ఏర్పాటైన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి- ఏప్రిల్‌కు మార్చారు.
ఈ సందర్భంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేస్తారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ పుండరీక వల్లి అమ్మవారి ఆలయం నుంచి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షణగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పిస్తారు.
శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఆలయంలోని గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications