తిరుమల శ్రీవారి సీనియర్ సేవకులకు కొత్త డిజిగ్నేషన్- కోటా విడుదల
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు తోడు కావడం వల్ల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. ఆదివారం నాడు 78,177 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,694 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.53 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచివుండలేదు. క్యూ లైన్‌ల ద్వారా నేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పట్టింది.

కాగా- భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఈశా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనం ఆధారంగా శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. ఈ మార్పులు ఈ నెల 30వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. మార్పులు చేర్పులు చేసిన అప్లికేషన్ ద్వారా శ్రీవారి సేవకులను ఎంపిక చేయనున్నారు టీటీడీ అధికారులు. జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవకుల కోటాను కొత్త అప్లికేషన్ ద్వారా విడుదల చేస్తారు.
జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) కోటా ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ బుకింగ్ ఓపెన్ అవుతుంది. నవనీత సేవ (మహిళలకు మాత్రమే)- మధ్యాహ్నం 12, పరకామణి సేవ (పురుషులకు మాత్రమే)- ఒంటిగంట, గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా ప్రారంభం) 2 గంటలకు అందుబాటులోకి వస్తాయి.
గత రెండు సంవత్సరాలుగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు శ్రీవారి సేవలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిని గ్రూప్ లీడర్స్‌గా పిలుస్తారు. 15 రోజులు, ఒక నెల లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవచ్చు. ఈ గ్రూప్ లీడర్స్ శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించడం, సేవకు వారి హాజరు తీసుకోవడం, ప్రతి ఒక్క సేవకుడు/సేవకురాలి పనితీరుకు రేటింగ్ ఇవ్వడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు.
పరకామణి సేవలో జనరల్ పురుష సేవకులకు అవకాశం కల్పించారు టీటీడీ అధికారులు. కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఆన్ లైన్ ద్వారా పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications