తిరుమల పీఏసీ- 5లో ఈఓ చేపట్టిన తనిఖీల్లో..
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 70,217 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,155 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.84 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు కల్పిస్తోన్న సౌకర్యాలు, అందుతున్న సేవల గురించి స్వయంగా ఆరా తీశారు. భక్తులతో మాట్లాడారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా తిరుమలలోని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. సీఆర్ఓ ఆధునికీకరించడానికి చేపట్టిన ప్రణాళికలపై టీటీడీ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ ఆయన వివరించారు. ఆధునికీకరణ పనుల పురోగతి, బ్లూప్రింట్ కు సంబంధించిన పూర్తి వివరాలను అందజేశారు.
భారీగా పెరుగుతున్న శ్రీవారి భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని సీఆర్ఓను అత్యాధునికంగా తీర్చిదిద్దాలని, ఈ క్రమంలో భవిష్యత్ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్యామలరావు సూచించారు. గడువులోగా ఇంజినీరింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.
తిరుపతిలో ఎస్ఎస్‌డీ కౌంటర్ల నిర్వహణ, అన్నప్రసాదం విభాగం ఆధునికీకరణ, పరకామణి నిర్వహణ, పారిశుద్ధ్యం, టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా బాలాజీ నగర్ గృహాల పరిశీలన, కాలిబాట మార్గాలలోని దుకాణాల తనిఖీలు, యాత్రికుల వసతి సముదాయాల్లో కేంద్రీకృత లాకర్ కేటాయింపు వ్యవస్థల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
కొత్తగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని శ్యామలరావు, వెంకయ్య చౌదరి సందర్శించారు. అన్ని గదులను పరిశీలించారు. వెయిటింగ్ హాళ్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నందున శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈఓ చెప్పారు. వారికి కల్పించే భద్రత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.












Click it and Unblock the Notifications