తిరుపతి లోకల్స్‌కు అలర్ట్
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 57,863 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,030 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.04 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

శ్రీవారి దర్శనం స్థానికుల కోటా టోకెన్లను మే 4వ తేదీ అంటే ఆదివారం జారీ చేయనున్నారు టీటీడీ అధికారులు. ప్రతి నెలా మొదటి మంగళవారం (మే 6వ తేది) స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా మే 4వ తేది ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను విడుదల చేయనున్నారు.
తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో వాటిని అందజేస్తారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన తెల్లవారు జామున 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.
తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానికులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సి ఉంటుంది. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలంటూ టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా- స్థానికులు శ్రీవారిని దర్శించుకునే 6వ తేదీ నాడే తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం కానుండటం విశేషం. 6 నుండి 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి.
మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీల్లో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సందర్భంగా మే 6 నుండి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు పురాణ ప్రాశస్త్యం ఉంది. 5,000 సంవత్సరాల కిందట అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు.
ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.
ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. 1992 నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ.












Click it and Unblock the Notifications