రేపు శ్రీవారి రూ. 300 టికెట్లు విడుదల- ఈ తేదీల కోసం మాత్రమే.. !!
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కిందటి నెల ముగిశాయి. మొత్తం 5.76 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 28.94 కోట్ల రూపాయలు హుండీ ద్వారా కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో మొత్తం 21.84 లక్షల అన్నప్రసాదాలను స్వీకరించారు. 2.04 లక్షల మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే.. 33 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి.
ఇప్పుడిక శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కాబోతోన్నాయి. వీటి తేదీలను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో కన్యామాసం (భాద్రపదం) లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 11 నుండి 20వ తేది వరకు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేయబోతోంది. ఈ టికెట్లు ఈ నెల 7వ తేదీన అంటే బుధవారం నుంచి టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది.
అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని, వీటిని తమ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈ నెల 11 నుండి 20వ తేది వరకు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశామని తెలిపింది. ఆయా తేదీల్లో ఎటువంటి సిఫారసు లేఖలను కూడా స్వీకరించబోమని స్పష్టం చేసింది.
అక్టోబర్ 11 నుండి 20వ తేది వరకు తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనుండటంతో పాటు పెరటాసి మాసం చివరి వారం కావడంతో భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. 20వ తేదీ తర్వాతే వీటిని పునరుద్ధరించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
