అసెంబ్లీలో బాబుకు థ్యాంక్స్ ఏది?: కెసిఆర్‌కు టిటిడిపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం లేఖ ఇచ్చిన తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ అసెంబ్లీలో కృతజ్ఞతలు చెప్పక పోవడాన్ని తెలంగాణ టిడిపి నేతలు తప్పు పట్టారు. తెలంగాణ ఏర్పాటులో టిడిపి పాత్ర కూడా ఎంతో ఉందన్నారు.
తెలంగాణ వచ్చినందుకు కెసిఆర్ కాంగ్రెసు అధినేత్రికి, బిజెపి నేత రాజ్ నాథ్ సింగ్‌కు, ఇతర పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారని, బాబును మాత్రం పట్టించుకోలేదని టిటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందే టిడిపి అన్నారు. ఆ తర్వాత మరోసారి కూడా అదే లేఖను పంపించామ్నారు. అలాంటప్పుడు బాబుకు కృతజ్ఞతలు చెప్పక పోవడం సరికాదన్నారు.
తెరాస నేతల ఆదాయం పెంచుకునేందుకే కొత్త మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని ఎల్ రమణ అన్నారు. మధ్యం విధానం తెలంగాణ పేదల రక్తం పీల్చేలా ఉందని గతంలో విమర్శించిన తెరాస, నేడు అధికారంలోకి రాగానే అవన్నీ మర్చిపోయిందన్నారు. బెల్టు షాపుల రద్దును గాలికొదిలి, మద్యం అమ్మకాలను బంగారుబాతులా భావించి కొత్త విధానాన్ని తెచ్చిందన్నారు.

తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం సొంత జాగీరులా, కెసిఆర్ నియంతలా మాట్లాడారన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని శాసన సభలో ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టు సమస్యను ఎలా పరిష్కరిస్తారంటే... అదొక చిన్న విషయంగా కెసిఆర్ మాట్లాడారన్నారు. రుణమాఫీని ఆలస్యం చేయడం వల్ల ఇప్పటికే 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కెసిఆర్ ఓ పక్క ప్రతిపక్షాల సహకారం కోరుతునే మరో పక్క సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో పలు తీర్మానాలు చేసిన ప్రభుత్వం వాటిపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదన్నారు.
తెరాస ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ధ్వజం
తెరాస ప్రభుత్వం తన ఎన్నికల హామీల్లో భాగంగా అమలు చేస్తోన్న పథకాలపై స్పష్టత కొరవడిందని, ఫలితంగా రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పథకాలపై మంత్రులకే అసలు అవగాహన లేదని, అధికారులకు స్పష్టత కొరవడిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక సాధారణ ప్రజలు, రైతులు, విద్యార్థులు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినా... పాలనలో వేగం పుంజుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని తదితర విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా ముందుకు కదులుతుంటే, తెలంగాణ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ముస్లిం రిజర్వేషన్లు, బీసీ మంత్రిత్వ శాఖపై ఆదరాబాదరగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వెంటనే స్పీకర్ ఆమోదించడం, చర్చకు తావులేకుండా చేయడం సరికాదన్నారు.
పంట రుణాల మాఫీపై అసలు ఆర్థిక మంత్రికే ఈ అంశంపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎక్సైజ్ పాలసీలో బెల్టు షాపుల రద్దు అంశమే లేదన్నారు. టీవీ చానెళ్ల ప్రసారాంశాలు అసహ్యంగా, అశ్లీలంగా ఉండకూడదని, విమర్శనాత్మకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications