తిరుమలలో భక్తుల కోసం కొత్త పీఏసీ 5- ప్రత్యేకతలు
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 68,095 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 23,932 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.70 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బంది అల్పాహారం, పాలు పంపిణీ చేశారు. శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు.

ఈ ఏడాది ఎనిమిది లక్షలమందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న పీఏసీ 5లో టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పీఏసీ-5 భవన సముదాయం ఇది. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా భవనంలోని హాళ్లు, అన్న ప్రసాద వితరణ హాలు, కల్యాణకట్ట, మరుగుదొడ్లు, తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రాన్ని తనిఖీ చేశారు. దాని పనితీరును పరిశీలించారు. Reklaim Ace సంస్థ చీఫ్ వివేక్ దీని ఉపయోగాలను వివరించారు. ఇప్పటికే ఈ యంత్రాన్ని ఉత్తరాఖండ్‌లోని చారధామ్ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్లాస్టిక్ బాటిళ్లను గంగానదిలో విసిరేయకుండా వాటిని సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
భక్తులు ఈ యంత్రంలో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వదిలివేయవచ్చని, అందుకోసం యూపీఐ ద్వారా లాగిన్ అయ్యి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి, రింగ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు వదిలివేస్తే వారికి రూ.5 ప్రోత్సాహకంగా లభిస్తుందని తెలిపారు. దీని ద్వారా సామాజిక అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ వినూత్న యంత్రం పనితీరును టీటీడీ ఈవో ప్రశంసించారు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లుగా అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications