ఈ నెల 12న.. తిరుమలలో
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 72,960 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,126 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.63 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నాలుగు కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 7 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ నెల 12వ తేదీన తిరుమలలో తుంబురు తీర్థ ముక్కోటిని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి దాదాపుగా 12 కిలోమీటర్ల దూరంలో వెలసింది ఈ తుంబురు తీర్థం. ప్రతి సంవత్సరం ఇక్కడ ముక్కోటి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పురాణ ప్రాశస్త్యం ప్రకారం తిరుమల శేషగిరుల్లో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాల్లో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదాయాన్ని కలిగించేవి ఏడు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం, పాండవ తీర్థాలు.
ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
కాగా- తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు సహస్రదీపాలంకారసేవ నిర్వహించారు.
ఆ తరువాత శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఇందులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications