ఉదయ్ కిరణ్ ఆత్మహత్య: కొత్త మలుపులు, ఇంకేమైనా..
హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. సినిమా అవకాశాలు రాకపోవడం, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులు, చేసిన అప్పులు తీర్చలేక.. ఇలా కేసు మలుపులు తిరుగుతోంది. అనుమానస్పద మృతిగా భావించి తొలుత పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు లేక, తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తెలిసింది.
ఆ తర్వాత విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు కుటుంబ కలహాలు, సినిమా అవకాశాలు రాకపోవడం, నిన్నటికి నిన్న అప్పుల వాళ్ల ఒత్తిడికి తట్టుకోలేక ఇలా రకరకాల కోణాలు బయటకు వచ్చాయి. పోలీసులు విచారణ మరింత వేగవంతం చేయడంతో కేసు మరిన్ని కీలక మలుపులు తిరుగుతోంది. అంతలోనే ఉదయ్ ఆత్మహత్యకు ఆయన మాజీ మేనేజర్ మున్నా కారణమని పలు కథనాలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ మొదలుపెట్టి మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ కిరణ్ వ్యవహార శైలికి సంబంధించి మున్నా నుంచి సమాచారాన్ని రాబట్టారు.

ఉదయ్ సున్నిత మనస్కుడని కోపమొస్తే కత్తితో తన శరీరంపై తానే కోసుకునేవాడని మున్నా పోలీసులకు చెప్పినట్టు సమాచారం. తాను తీసుకున్న అప్పునకు ఉదయ్ కిరణ్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మున్నా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా ముందుగా ఉదయ్ కిరణ్ భార్య విషిత, అత్తామామలను, అపార్ట్‌మెంటలోని కుంటుంబాలను విచారించిన పోలీసులు కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణాలపై ఆరా తీశారు.
విషిత వాంగ్మూలం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఫైనాన్షియర్ సంగీత పేరు తెర పైకి వచ్చింది. సంగీత పలుమార్లు ఉదయ్ కిరణ్ ఇంటికి వచ్చి డబ్బులకు సంబంధించి అడిగేదని విషిత పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది. దీంతో సంగీత సోమవారం మీడియా ముందుకు వచ్చారు. తన వద్ద ఉదయ్ కిరణ్ మాజీ మేనేజర్ మున్నా 17 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, ఆ అప్పునకు సంబంధించి ఉదయ్ ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదని తెలిపారు.
మున్నాకు అప్పు ఇచ్చిన సమయంలో ఉదయ్‌తో మాట్లాడానని, అది కూడా మున్నా ఫోన్ కలిపిస్తేనే అని ఆమె స్పష్టం చేశారు. తానెప్పుడు డబ్బు కోసం ఉదయ్‌పై ఒత్తిడి తేలేదని, ఈ వ్యవహారంలో తన పేరు ఎలా బయటకు వచ్చిందో తెలియడం లేదన్నారు. సంగీత చెప్పిన వివరాలతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వ్యవహారం మరో మలుపు తిరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టిన అన్ని కోణాల్లో ఏదో కొత్త విషయం వెలుగు చూస్తోంది.
దీంతో పోలీసులు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో ఉదయ్ భార్య విషిత, ఆమె తల్లిదండ్రులను పోలీసులు మరోసారి విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications