కదులుతున్న రైల్లోంచి జారిపడ్డ చిన్నారి క్షేమం: తల్లి, మరో బిడ్డ మృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వట్లూరు రైల్వేట్రాక్‌పై 14 నెలల బాలుడు పడి ఉండటాన్ని చూసిన లైన్‌మెన్ రైల్వే ఉద్యోగులకు సమాచారమిచ్చాడు. బాలుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే రైల్వే అధికారులు అతడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే అదే మార్గంలో రైల్వే ట్రాక్ సమీపంలో తల్లి, కూతురు మృతదేహాలను కూడా అధికారులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. వీరంతా రైలు నుంచి జారిపడడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బాలుడి తలకు బలమైన గాయం తగిలింది.

ఈరోజు ఉదయం తెల్లవారుజామున రైలు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు. రైలు నుంచి జారిపడ్డ 14 నెలల బాలుడు మాత్రం మృత్యుంజయుడుగా నిలిచాడు. 14 నెలల బాలుడు రైలు నుంచి జారిపడటంతో ఆ చిన్నారిని కాపాడుకునే ప్రయత్నంలో కంగారులో తల్లీ కూతుళ్లు రైల్లోంచి దూకేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒక్కసారిగా రైల్లోంచి దూకేయడంతో తల్లీతో పాటు నాలుగేళ్ల కూతురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం తెల్లవారుజామున ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications